మిడతల దండు ముప్పు మనకు లేదు

30 May, 2020 05:08 IST|Sakshi
సారిపల్లిలో మొక్కపై మిడతల గుంపు

వస్తే ఏం చేయాలన్న దానిపై శాస్త్రవేత్తల సూచనలు

సాక్షి, అమరావతి/నెల్లిమర్ల రూరల్‌: మిడతల దండుతో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలకు ముప్పు వాటిల్లినా గత 80 ఏళ్లలో రాష్ట్రంలోకి ఎన్నడూ అవి ప్రవేశించిన దాఖలాలు లేవని గుంటూరు లాంఫాంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎన్‌వీవీఎస్‌ దుర్గాప్రసాద్, డాక్టర్‌ ప్రమీలా రాణి స్పష్టం చేశారు. 80 ఏళ్ల కిందట మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ప్రాంతంలోకి పరిమిత స్థాయిలో ఇవి వచ్చినట్టు చరిత్ర ఉందని భారత మొక్కల పరిరక్షణ సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.ఎస్‌.ఆర్‌.కె. మూర్తి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోకి ఈ మిడతల దండ్లు వచ్చే అవకాశం లేదని, రైతులు ధైర్యంగా ఉండొచ్చన్నారు. ఉత్తర, పశ్చిమ భారతాన్ని మిడతలు వణికిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. 

వస్తే ఏమి చేయాలి? 
► మిడతల దండు వచ్చే సూచనలు ఉన్నట్టయితే 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనెను పంటలపై పిచికారీ చేయాలి. 
► శబ్దాలు చేస్తూ పంట మీద వాలకుండా జాగ్రత్త పాటించాలి. 
► పంటలపై లామ్డా సైహాలోత్రిన్, డెల్టా మైత్రిన్, ఫిప్రోనిల్, క్లోరిఫైరిఫాస్, మలాథియాన్‌లో ఏదో ఒకదాన్ని పిచికారీ చేయాలి.  

సారిపల్లిలో మిడతల కలకలం 
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో పలు చోట్ల పెద్ద సంఖ్యలో మిడతలు గుంపులుగా సంచరిస్తూ, జిల్లేడు చెట్లపై చేరి ఆకులను తింటున్నాయి. ఈ ప్రాంతంలో పంటలు కూడా ఏమీ లేకపోవడంతో మిడతల వల్ల ప్రమాదమేమీ లేదని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు