ఎందుకో.. ఏమో!

31 Jul, 2015 04:01 IST|Sakshi
ఎందుకో.. ఏమో!

 ఆత్మకూరు రూరల్: దర్జాకు ప్రతిరూపంగా నిలిచే నల్ల స్కార్పియో.. యజమానుల్లో తెలియని భయం సృష్టిస్తోంది. అధికారులు ఈ వాహనాల వివరాలను సేకరిస్తున్నా.. ఎందుకోసమనే వివరాలు వారికీ స్పష్టంగా తెలియకపోవడమే ఈ పరిస్థితి కారణం. గత మూడు రోజులుగా జిల్లాలోని నల్ల స్కార్పియో యజమానులు ప్రాంతీయ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల మెట్లు ఎక్కి దిగుతున్నారు. జిల్లాలోని నల్ల స్కార్పియోల సంఖ్య, వీటి వివరాలు తెలియజేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టుకమిషనర్‌కు ఓ లేఖ రాశారు. ఆ మేరకు నంద్యాల ఆర్‌టీఓకు.. కర్నూలు నంద్యాల, ఆదోని, డోన్ ఎంవీఐలకు ఈ సమాచారం చేరింది.
 
  వీరు తమ పరిధిలోని వాహన యజమానులకు నోటీసులు జారీ చేసి కార్యాలయంలో కలవాలని ఆదేశిస్తున్నారు. అలా వచ్చిన యజమానుల నుంచి వాహన వివరాలతో పాటు డ్రైవర్ సమాచారం సేకరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న వాహన శ్రేణిలో స్కార్పియో వాహనాలు ఉండటం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు అలాంటి వాహనాలు కాన్వాయ్‌లో కలిస్తే భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతోనే నల్ల స్కార్పియోల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అవసరమైతే వీటిని వినియోగించుకునే ఉద్దేశం కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
 
 ఉన్నతాధికారుల ఆదేశం మేరకే...
 డిప్యూటీ రవాణా కమిషనర్, జిల్లా కలెక్టర్‌ల ఆదేశాల మేరకు మా పరిధిలోని నల్ల స్కార్పియోల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశాం. వాహనం పూర్తి వివరాలతో పాటు డ్రైవర్ వివరాలను సేకరించాం.
 -జింకల అనిల్ కుమార్, ఎంవీఐ, ఆత్మకూరు
 

మరిన్ని వార్తలు