వినోదానికి తెర

5 Mar, 2018 09:02 IST|Sakshi
గుంటూరులో మూతపడిన సినీ ప్రైమ్‌ థియేటర్లు

జిల్లాలో 200 సినిమా థియేటర్లు బంద్‌

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల వైఖరికి నిరసన

వర్చువల్‌ ప్రింటింగ్‌ ఫీజు(వీపీఎఫ్‌)ను దశల వారీగా జీరో చేయాలని థియేటర్ల యజమానుల డిమాండ్‌

ప్రకటనల ఆదాయం హాళ్లకే ఇవ్వాలని వినతి

నగరంలో ఒక్కో థియేటర్‌కు రోజుకు రూ.30 వేల నష్టం

ఈనెల 9 వరకు ఇదే పరిస్థితి అంటున్న యాజమాన్యాలు

పాత గుంటూరు: సామాన్యుడికి వినోదం పంచే సినిమాకు తెర పడింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు థియేటర్‌ యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు ఉద్యమబాట పట్టి బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు మూతబడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధి దెబ్బతింది.  డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు వసూలు చేసే ధరల్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు థియేటర్‌ యాజమాన్యాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలోని 200 థియేటర్లు మూతబడ్డాయి. ఈనెల 9 వరకు బంద్‌ కొనసాగనుందని తెలిసింది.

బంద్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది? 
గతంలో సినిమాలను మనందరికీ తెలిసిన రీల్‌ ఫార్మెట్‌లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించేవారు. 12 ఏళ్ల కిందట డిజిటల్‌ సినిమా రంగప్రవేశం చేసింది. ల్యాబ్‌ నుంచి ప్రింట్‌ తెచ్చుకునే అవసరం లేకుండా హార్డ్‌ డిస్క్‌ను తెచ్చుకుని డిజిటల్‌ ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమా వేసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వారిని డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు(డీఎస్పీ)లుగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశమంతటా తమ టెక్నాలజీని దశల వారీగా అమర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా రీల్‌ ఫార్మెట్‌ లేదు. డిజిటల్‌ టెక్నాలజీ వచ్చిందని థియేటర్‌ యజమానులు ప్రొజెక్టర్లను తీసి పక్కన పడేశారు.

ఇదే డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లకు వరంగా మారింది. ఏకస్వామ్య విధానం అమలుచేయడానికి అవకాశం లభించింది. థియేటర్లలో అమర్చిన డిజిటల్‌ ప్రొజెక్టర్ల అద్దెను క్రమంగా కంపెనీలు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఫీజు థియేటర్‌ యాజమాన్యాలకు భారంగా మారింది. దేశంలో డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు అయిన యూఎఫ్‌ఓ, క్యూబ్‌ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. అంతా వారి చేతుల్లోనే ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా మౌనంగా ఉండిపోయారు. డీఎస్పీలు అద్దెలు, చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో చోట ఒకలా వున్నాయి.

ఇంగ్లిష్‌ సినిమాలకు ఎక్కడా వర్చువల్‌ ప్రింటింగ్‌ ఫీజు లేదు.. మనకు కూడా లేదు. ఉత్తరాదిలో హిందీ సినిమాలపై మన దగ్గర వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే సినిమా మన వద్ద వేస్తే వంద శాతం వీపీఎఫ్‌ చెల్లించాలి. ఉత్తరాదిలో అన్నీ హిందీ సినిమాలే కాబట్టి ఫీజు తక్కువగా వుంది. మన తెలుగు చిత్రాలకు పూర్తి ఫీజు చెల్లించాలి. ఈ ద్వంద్వ వైఖరిని దక్షిణాది నిర్మాతలు, పంపిణీదారులు వ్యతిరేకించారు. జేఎసీగా ఏర్పడి డిజిటల్‌ ప్రొజెక్టర్‌ అద్దె, వీపీఎఫ్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రకటనల ఆదాయంపై బాదుడే 
ఈ డీఎస్పీలు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వసూలు చేసే వీపీఎఫ్‌ కాకుండా థియేటర్‌ యజమానుల నుంచి రెండురకాలుగా లబ్ధి పొందుతున్నాయి. అందులో ఒకటి డిజిటల్‌ ప్రొజెక్టర్‌ అద్దె కాగా, మరొకటి ప్రకటనల ఆదాయం. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్‌ తర్వాత వేసే ప్రకటనల ఆదాయం మొత్తం డీఎస్పీలే తీసుకుంటున్నాయి.అందులో నామమాత్రంగా 10 నుంచి 15 శాతం మాత్రమే యాజమాన్యాలకు ఇస్తున్నారు. ప్రకటన సైజు తెలుపకుండానే నచ్చినంత సేపు వేసుకుంటూ యాజమాన్యాలకు నష్టాలు కలిగించడంతో పాటు ప్రేక్షకులను ఇబ్బందిపెడుతున్నారు.

డిజిటల్‌ ప్రొజెక్టర్ల అద్దె ఇలా...
నగరంలోని 4కె థియేటర్లు డిజిటల్‌ ప్రొజెక్టర్లకు వారానికి రూ.13,600 చెల్లిస్తున్నాయి. సాధారణ థియేటర్లు వారానికి రూ.10,300 చెల్లిస్తున్నాయి.వీటితో పాటు వీపీఎఫ్‌ నెలకు రూ.15 నుంచి రూ. 20 వేలకు వరకు చెల్లిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు