ఎస్‌ఈ వైఖరిపై గుర్రు

23 Nov, 2015 23:34 IST|Sakshi
ఎస్‌ఈ వైఖరిపై గుర్రు

 సామూహిక సెలవుకు టీడబ్ల్యూ  ఇంజినీర్ల నోటీసు
గిరిజన సంక్షేమ శాఖలో వివాదం
రేపిన ఈఈ బదిలీ వ్యవహారం

 
పాడేరు: గిరిజన సంక్షేమశాఖ పాడేరు ఈఈ బదిలీ వ్యవహారంలో ఎస్‌ఈ ఏవీ సుబ్బారావు వైఖరి వివాదం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ ఈఈగా పనిచేసిన ఎంఆర్‌జి నాయుడు 15 రోజుల క్రితం మంత్రి గంటా శ్రీనివాసరావు పీఏగా బదిలీ అయ్యారు. ఎంఆర్‌జి నాయుడును రిలీవ్ చేసి పాడేరు ఈఈగా చింతపల్లి గిరిజన సంక్షేమశాఖ డీఈఈ మోహన్‌రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈనెల 20న డీఈఈ మోహన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖలోని ఎస్‌ఈకి ఈ సమాచారం తెలిపారు. ఈఈగా మోహన్‌రావు నియామకం ఇష్టంలేని ఎస్‌ఈ అతనిని సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై ఆవేదనకు గురైన మోహన్‌రావు గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ యూనియన్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు విశాఖ సర్కిల్‌లోని 5 జిల్లాల ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈఈగా బాధ్యతలు తాను కోరుకోలేదని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చార్జి తీసుకున్నానని, ఎస్‌ఈ తీరుపై మోహన్‌రావు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఈ తీరును నిరసిస్తూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు, ఐదు జిల్లాల కలెక్టర్లకు, ఐటీడీఏల పీవోలకు యూనియన్ తరపున ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈ సుబ్బారావును మూడు రోజుల్లోగా మార్చాలని, లేకుంటే ఈనెల 25 నుంచి సామూహిక సెలవులపై వెళతామని ఇంజినీరింగ్ అధికారులు నోటీసు ఇచ్చారు.

 కలకలం రేపిన ఎస్‌ఈ వ్యవహారం
 గిరిజన సంక్షేమ శాఖలో ఎస్‌ఈ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. పార్వతీపురంలో ఈఈగా పనిచేసిన ఈయన ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందకపోయిన గిరిజన మంత్రి అండతో ఎస్‌ఈగా నియమితులయ్యారన్న వాదన ఉంది. మూతపడిన ప్రభుత్వ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ నుంచి జీఓ 94 ద్వారా గిరిజన సంక్షేమశాఖకు ఈయన వచ్చారు. ఇతర శాఖ నుంచి వచ్చిన కారణంగా పదోన్నతులు కూడా వర్తించవని,  అయితే ఈయన ఎస్‌ఈ స్థానంలో ఉండటంపై ఇంజినీరింగ్ అధికారుల్లో  నిరసన వ్యక్తమవుతోంది. గిరిజన సంక్షేమశాఖకు ఆరు నెలలుగా చీఫ్ ఇంజినీర్ లేరు అలాగే ప్రస్తుతం ఈశాఖలోని ఇద్దరు రెగ్యులర్ ఎస్‌ఈలకు నియామకాలు లేక గాల్లో ఉన్నారు. పాడేరు ఈఈ బదిలీతో ఇక్కడ వేరొకరిని ఈఈగా నియమించడానికి రూ.లక్షల్లో పైరవీలు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అనూహ్యంగా మోహన్‌రావు ఈఈగా బాధ్యతలు చేపట్టడం వివాదానికి తెరతీసింది.

మరిన్ని వార్తలు