తీరంలో ‘అల’జడి

17 Jun, 2019 11:00 IST|Sakshi
ముందుకు వచ్చిన సముద్రం

అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌లో అల్లకల్లోలం

140 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం

ప్రాణభయంతో పరుగులు పెట్టిన మత్స్యకారులు

సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): ‘అల’కల్లోలం.. తీరంలో భయం భయం .. ముందుకు వచ్చిన సముద్రం.. కోతకు గురవుతున్న రక్షణ గోడలు.. ఇదీ అక్కుపల్లి శివసాగర్‌ తీరంలో పరిస్థితి.. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. కోస్తాంధ్రకు ఆవల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ గంటకు 30– 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు చేశారు. బంగాళాఖాతంలో రెండు రోజులుగా అలజడి మొదలైంది. అధికారుల హెచ్చరికలకు మించి పరిస్థితి భయాందోళనగా మారింది. దీని ప్రభావంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

ఆదివారం వేకువజామున అక్కుపల్లి శివసాగర్‌ తీరంలో సముద్రం సుమారు 140 మీటర్లు ముందుకు వచ్చింది. దీంతో తీరంలో ఉన్న ఇసుక దిబ్బలు, బీచ్‌లో నిర్మించిన రక్షణ గోడ కోతకు గురైంది. ఎన్నడూ లేనివిధంగా సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు భయందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు వేటకు విరా మం ఉండటంతో కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. వేట నిషేధాన్ని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఎంతో ఆశతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధం అవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడిని చూసి వారు భయాందోళన చెందుతున్నారు.

భయానక వాతావరణం
గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కుపల్లి, నువ్వలరేవు, గుణుపల్లి తీరాలలో సముద్రం ముందుకు వచ్చిందని మత్స్యకారులు తెలిపారు. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ గాలులు వీయడంతోపాటు ఇలా సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో భయం వేస్తుందని వారు భయాందోళన చెందారు. అయితే రాత్రి సమయంలో పరిస్థితి మరింతగా భీకరంగా మారితే ప్రమాదం తప్పదని వారు వాపోతున్నారు. ఇప్పటికే వేట చేసేందు కు సిద్ధంగా ఉన్న తరుణంలో గంగమ్మ తల్లి ఉప్పొంగడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వేట లేక ఇబ్బందులు పడ్డామని ఇక వేట సాగించుకోనే సమయం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో సముద్రంలో అలజడి తమను కలవరపెట్టిందన్నారు.

ప్రాణభయంతో పరుగులు
సముద్రం వేకువజామున ముందుకు వచ్చింది. మరోసారి ఉదయం 9 గంటల సమయంలో ముందుకు రావడంతో మత్స్యకారులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌లో ఇప్పటికే కోటి రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. వీటికి రక్షణగా సిమెంట్, రాళ్లతో రక్షణ గోడ నిర్మించారు. అలలు ఉధృతంగా ఎగసి పడుతూ నీరు ముందుకు రావడంతో నిర్మాణాలు కొట్టుకుపోయి రాళ్లు తేలిపోయాయి. కాగా మరికొద్ది దూరంలో పడవలను సురక్షితంగా ఉంచారు. సముద్రపు నీరు వాటిని తాకి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అయితే సముద్రం కొద్ది దూరంలో ఆగిపోవడంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు