పంచాయతీల్లో ఆదాయ మార్గాల కోసం అన్వేషణ

27 Aug, 2014 02:32 IST|Sakshi

బద్వేలు: పంచాయతీలకు ఆదాయం సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి పంచాయతీల వికేంద్రీకృత అభివృద్ధి పేరిట వివిధ ఆదాయ వనరులను గుర్తించి, వాటితో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయంతో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇందులో భాగంగా కడప సమీపంలోని పబ్బాపురాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫలితాలను సమీక్షిస్తున్నారు. ఈ విధానాన్ని త్వరలో జిల్లాలోని 784 పంచాయతీల్లో అమలు చేయనున్నారు.
 
ఆదాయమే పరమావధి
గ్రామ పంచాయతీలకు ఆస్తి, కుళాయి పన్నులే ఇప్పటి వరకు ఆదాయ వనరులుగా ఉన్నాయి. వీటితోనే అభివృద్ధి పనులు కూడా చేపట్టాలి. ఇకపై మరింత ఆదాయం సమకూరేలా ఆయా పంచాయతీల్లోని ఆదాయ వనరులను గుర్తించాలని పేర్కొంటూ ఇటివలే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పేరిట జీవో నెం.464ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికకు త్వరలో చర్యలు ప్రారంభించనున్నారు. ఈ దిశగా పంచాయతీలను కూడా సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఇదే విషయమై సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్‌డీలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నారు.
 
అభివృద్ధికి నాలుగు దశలు
వికేంద్రీకృత ప్రణాళిక అమలుకు మొదట పంచాయతీల సమాచారం సేకరిస్తారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, వీధిదీపాలు, అంతర్గత రోడ్లు, వ్యవసాయం, ఆరోగ్యం, పశుసంపద, ఇళ్లు, పారిశ్రామిక వనరులు, పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని రెండో దశలో సేకరిస్తారు. తర్వాత మూడో దశలో ఆర్థిక వనరుల సమీకరణ చేస్తారు. ఇంటి పన్ను, నీటి పన్నుతో పాటు వీధీ దీపాల పన్ను, డ్రైనేజీ పన్ను, గ్రంథాలయ పన్ను, ప్రకటనల పన్ను, మార్కెట్లు, సంతలు, లే-అవుట్‌ల రుసుం, సేవారుసుం, ఆక్రమణల పన్ను, ప్రభుత్వ నిధులు, కేటాయింపులు, ఇతర శాఖల నిధులను గుర్తిస్తారు.చివరి దశలో పై వాటన్నింటిని క్రోడీకరించి గ్రామస్థాయి అవసరాలను గుర్తించి ప్రణాళికను రూపొందిస్తారు. అనంతరం గ్రామసభల్లో చర్చించి మార్పులు, చేర్పులు చేసి వికేంద్రీకృత ప్రణాళికను తయారు చేసి మండల స్థాయి సమావేశంలో అనుమతులు పొంది అమలు చేస్తారు.

మరిన్ని వార్తలు