ఆ నలుగురూ ఎక్కడ..?

21 Mar, 2020 09:36 IST|Sakshi

కరోనా బాధితుడితో ప్రయాణించిన  వారి కోసం గాలింపు  

జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, కాకినాడ: కరోనా వైరస్‌ సోకడంలో ఓ వ్యక్తి విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు రైలులో ప్రయాణించి సామర్లకోటలో దిగినవారి కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వారికి దగ్గు, జలుబు లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఆ వివరాల్లోకి వెళ్తే... షేక్‌ సత్తార్‌ మక్కా యాత్రను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అతనికి కరోనా సోకిందని తేలడంతో విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నాడు. అతను హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని బీ–1 కోచ్‌లో ఈ నెల 12న ప్రయాణించాడు. అతనితో పాటు మరికొంత మంది అదే బోగీలో ఉన్నారు. వారిలో నలుగురు సామర్లకోటలో దిగినట్లు సమాచారం. వారెవరనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. (కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు)

ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం వారి కోసం జల్లెడ పడుతోంది. వైద్య, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముమ్మరంగా గాలిస్తోంది. వారు సామర్లకోటకు చెందిన వ్యక్తులా? లేక కాకినాడ వాసులా? ఇతర ప్రాంతాలకు చెందిన వారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. వారే స్వచ్ఛందంగా ముందుకొస్తే వైద్య పరీక్షలు చేయిస్తామని కలెక్టర్‌ తెలిపారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేనిపక్షంలో వారితో పాటు ఇతరులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. దీనిపై ఇప్పటికే అలర్ట్‌ ప్రకటించామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు. (కరీంనగర్‌లో ఇం‍డోనేషియన్లకు ఏం పని..?)

మరిన్ని వార్తలు