తీరం కబ్జా

29 Dec, 2014 01:18 IST|Sakshi

ఉలవపాడు: సాగర తీరం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. బడాబాబుల చేతుల్లో పడి రొయ్యల చెరువులుగా మారిపోయింది. పొరుగు జిల్లా నుంచి వచ్చి మరీ ఇక్కడి తీరంలో వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ అధికారులు కిమ్మనడం లేదు. మండల పరిధిలోని కరేడు కొత్త పల్లెపాలెం తీరప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్‌కు, సముద్రానికి మధ్యలోని సుమారు 125 ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేసి వ్యాపారం చేస్తున్నారు. సముద్రం ఆనుకుని ఈ చెరువులు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆక్రమణ జరిగిందిలా...
కరేడు కొత్త పల్లెపాలెం గ్రామస్తులను రొయ్యల వ్యాపారులు మంచి చేసుకున్నారు. తాము ఆ భూమిలో రొయ్యల చెరువులు నిర్మిస్తామని, దానికి ప్రతిఫలంగా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున గ్రామానికి ఇస్తామని ఆశచూపారు. ప్రభుత్వ పొలాల వలన తమకు ఆదాయం వస్తుందని గ్రామస్తులు సంతోషించారు.  నగదు చెల్లించి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకున్న వ్యాపారులు దాదాపు 5 నెలల నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా అక్రమార్కులకు అండగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

అధికారుల అండతోనే...
అధికారుల అండతోనే ఇక్కడ రొయ్యల చెరువులు వేయగలిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వచ్చిన తహశీల్దార్‌తో మాట్లాడి తమ వ్యాపారానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా ఉండడంతో ఒక పంటను అమ్మారు. వెనామీ రొయ్యలను పెంచి  కేజీ 300 రూపాయల చొప్పున అమ్మి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారులంతా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 80 కి.మీ ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత మేరకు లాభాలు వస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది.
 
జనరేటర్లతోనే నిర్వహణ...
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. పట్టా భూములకు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. దీని కోసం చాలా పాట్లు పడ్డారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. తహశీల్దార్ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ చెరువుల నిర్వహణ మాత్రం ఆగలేదు. జనరేటర్లతో బోర్లను ఏర్పాటు చేసి రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. కొంత నీరు సముద్రం నుంచి కూడా పంపింగ్ చేసి చెరువులకు పెడుతున్నారు.

ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బకింగ్‌హామ్ కెనాల్, సముద్రం మధ్య భాగాన్ని ఎంతో విలువైనదిగా చూసేవారు. బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా భారీ ఓడలు కూడా వెళ్లేవి. ప్రభుత్వం మళ్లీ ఈ కెనాల్ అభివృద్ధి చేయాలని చూస్తున్న తరుణంలోనూ ఆక్రమణలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ విషయమై తహశీల్దార్ శ్రీశిల్పను సాక్షి వివరణ కోరగా ‘వంద ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైందా..అవునా..నేను సోమవారం ఉదయం వచ్చి మాట్లాడతాను’ అని చెప్పారు.

>
మరిన్ని వార్తలు