సీజనల్ వ్యాధులతో అప్రమత్తం

11 Jun, 2015 03:37 IST|Sakshi
సీజనల్ వ్యాధులతో అప్రమత్తం

 జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వాణిశ్రీ
 
 గుంటూరు మెడికల్ : జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు కురిసి  దోమలు వృద్ధి చెంది వ్యాధులను కలుగజేస్తాయని, సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వాణిశ్రీ హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో బుధవారం జరిగిన  విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దోమ కాటు ద్వారా పలు వ్యాధులు వస్తాయని, వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దోమ తెరలు వాడాలని సూచించారు. దోమలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వారానికి ఒకసారి డ్రై డే పాటించాలని చెప్పారు.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.  హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశామని, సీజనల్ వ్యాధులకు మందులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి మాట్లాడుతూ  జూన్ 1 నుంచి 30 వ తేదీ వరకు నెలరోజుల పాటు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారని.  జ్వరం వచ్చిన వెంటనే  రక్త పరీక్షలు చేసి మందులు అందజేస్తారని చెప్పారు. జిల్లా మలేరియా అధికారి వరదా రవీంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెలను యాంటీ మలేరియా నెలగా, జూలై నెలను యాంటీ డెంగీ నెలగా నిర్ణయించి ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు.  దోమలద్వారా, నీటి ద్వారాా, గాలి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయని, వ్యాధులు దరిచేరకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. 

సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా  వారానికి ఒకసారి వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. చర్చిలు, మసీదులు, గుడుల్లో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో గత ఏడాది 130 మలేరియా కేసులు నమోదవగా ఒక్క గుంటూరు నగరంలోనే 102 కేసులు నమోదు అయినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు