ఆదర్శ పాఠశాలలకు అదనపు సీట్లు

25 Jun, 2018 12:43 IST|Sakshi
లావేరులోని మోడల్‌ స్కూల్‌

జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిన ఉత్తర్వులు

25 శాతం సీట్ల కేటాయింపునకు ప్రభుత్వం అంగీకారం

అదనపు సౌకర్యాలు కల్పించలేమని మెలిక

6వ తరగతి అర్హత మార్కులు తగ్గించే అవకాశం

7, 8, ఇంటర్‌ అడ్మిషన్లకు సైతం సీట్ల పెంపు వర్తింపు  

శ్రీకాకుళం: వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి చేసేందుకు 2012–13 విద్యా సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి, తరగతులు నిర్వహిస్తున్నారు. 6,7 తరగతులతోనే మొదలైన ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ వరకు విద్య అందిస్తున్నారు. ఏపీ మోడల్‌ స్కూళ్లు వచ్చి న రెండు, మూడేళ్ల వరకు కూడా సరైన ప్రచారం లేకపోవడంతో ఎలా చేర్పించాలో తెలిసేది కాదు. వరుసగా అధిక ఫలితాలు సాధిస్తుండడంతో ఎలా గైనా చేర్పించాలనే ఆసక్తితో రాజకీ య నాయకులను సైతం కలుస్తున్నారు. గత ఏడాది నుంచి 6వ తరగతిలో చేరేందుకు భారీగా దరఖాస్తులు రావడం, ఈ ఏడాది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు రావడంతో విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న సీట్లకు 25 శాతం అదనంగా పెంచారు. దీనికి సంబంధించి రెండు రోజుల కిందట జిల్లాకు ఉత్తర్వులు చేరాయి. దీంతో ఇప్పటివరకు ఒక్కో తరగతిలో 80 సీట్లు ఉండగా అవికాస్తా 100కు చేరాయి.

జిల్లాలో 14 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. రెండేళ్ల కిందటి వరకు పదో తరగతి వరకు మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్‌ వరకు మోడల్‌ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. రెసిడెన్షియల్‌ తరహాలో మోడల్‌ స్కూళ్లను నిర్వహించాలన్న లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. ఏ కారణంగానో గత ఏడాది వరకు వసతి గృహాలు ప్రారంభం కాలేదు. గత ఏడాది ఆరు మోడల్‌ స్కూళ్లలో బాలికల వసతి గృహాలను ప్రారంభించారు. ఈ ఏడాది మిగిలి ఉన్న 8 వసతి గృహాల్లో బాలికల వసతి గృహాలను ప్రారంభిస్తున్నారు. ప్రతి వసతి గృహంలోను ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే వంద మంది బాలికలకు అవకాశం కల్పిస్తారు. బాలురకు మాత్రం వసతి సౌకర్యం కల్పించలేదు. అయితే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండడం వల్ల మోడల్‌ స్కూళ్లకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 25 శాతం సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇక్కడో కొత్త మెలికను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. సీట్లు పెంచినా బడ్జెట్‌ను గానీ, ఫర్నిచర్, బోధన సిబ్బంది సంఖ్యను పెంచేది లేదని పేర్కొన్నారు.

అర్హత మార్కులు తగ్గించే ఆలోచన..
ఈ ఏడాది ఆరో తరగతి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడం, ప్రశ్నపత్రం కాస్త కఠినంగా రావడంతోనే ఎక్కువ మంది అర్హత సాధించలేదు. దీంతో అర్హత మార్కులను తగ్గించి ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు 7, 8 తరగతుల్లో చేరేందుకు ఆసక్తి చూపే వారికి సైతం అడ్మిషన్‌ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ప్రవేశ పరీక్ష నిర్వహించాలా, వచ్చిన విద్యార్థులకు రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయించాలా అనేది ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లకే అప్పగించారు.

ప్రచారం కరువు
జిల్లాలో మోడల్‌ స్కూళ్లకు విశేష ఆదరణ ఉన్నా సీట్లు పెంచిన విషయాన్ని ప్రచారం చేయకపోవడంతో ఈ విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. మోడల్‌ స్కూళ్లకు ఇన్‌చార్జిగా ఉన్న అధికారి స్థానికంగా కాకుండా నిత్యం దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అధికారి డీఈఓ కార్యాలయ ఏడీగా కూడా పనిచేస్తుండడంతో మోడల్‌ స్కూళ్లను అదనపు భారంగానే భావిస్తున్నట్లుగా అవగతమవుతోంది. మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలపై ఇప్పటివరకు స్పష్టతను ఇచ్చే ప్రకటన చేయలేదు. డీఈఓ కూడా దీనిపై దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోయింది. ఉప విద్యాశాఖాధికారులను తొలగించడంతో అన్ని వ్యవహారాలు డీఈఓ చూసుకోవాల్సి వస్తోంది. ఉన్న ముగ్గురు ఏడీల్లో ఇద్దరు స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడం, మూడో ఏడీకి పాలనాపరమైన అనుభవం కాస్త తక్కువగా ఉండడంతో వారి సహకారం కూడా డీఈఓకు లేకుండా పోయింది.  

ఆదేశాలు అందాయి
ఏపీ ఆదర్శ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే మంచి స్పందన వస్తోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కో స్కూల్‌కు 25 శాతం అదనంగా సీట్లు కేటాయించేందుకు కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్మీడియెట్‌ వరకు అదనపు సీట్ల పెంపు వర్తిస్తుంది. మోడల్‌ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంపుపై ప్రచారం చేశాం. సోమవారం నుంచి మరింత ప్రచారం చేసి పెరిగిన సీట్లన్నీ భర్తీ అయ్యేలా చూస్తాం.– ఎం. సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి

మరిన్ని వార్తలు