కృష్ణా జలాలపై రెండో రోజూ కొనసాగిన విచారణ

13 Dec, 2017 00:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు మంగళవారం కూడా విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫు సాక్షి అయిన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫు న్యాయవాది వైద్య నాథన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని కూడా ఏపీ తరలిస్తోందన్న ఆరోపణల్లో నిజం లేదని, ఇక్కడ కృష్ణా నది నిర్వహణ బోర్డు ఆదేశాల మేరకే నీటి విడుదల జరుగుతోందని వైద్యనాథన్‌ అడిగిన ప్రశ్నకు సుబ్బారావు బదులిచ్చారు.

శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్‌ ప్రాజెక్టు కావడం వల్ల ఇక్కడి నుంచి నీటి తరలింపునకు ఆస్కారం లేదని జస్టిస్‌ బచావత్‌ ట్రిబ్యునల్‌ పేర్కొన్న నేపథ్యంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు అంశమే తలెత్తదు కదా అని వైద్యనాథన్‌ ప్రశ్నించగా.. ఇది న్యాయపరిధిలోని అంశమని సుబ్బారావు సమాధానమిచ్చారు. వరద సమయంలో మిగులు జలాల తరలింపునకు అదనపు సామర్థ్యం పెంచడం ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సిల్‌ లెవెల్‌ 880 అడుగులకు చేరుతుంది కదా అని ప్రశ్నించగా.. సామర్థ్యం పెంపు అనే ది డిజైనర్ల నిర్ణయమని సుబ్బారావు చెప్పారు. హెడ్‌రెగ్యులేటర్‌ సిల్‌ స్థాయి 841 అడుగులే ఉండాలని డిజైనర్లకు సూచించారా? అని ప్రశ్నించగా.. ఇది నిజం కాదని సుబ్బారావు తెలిపారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది.

మరిన్ని వార్తలు