ఆధార్ నమోదులో ఏపీకి రెండోస్థానం

28 Jun, 2015 21:13 IST|Sakshi
ఆధార్ నమోదులో ఏపీకి రెండోస్థానం

సాక్షి, విజయవాడ బ్యూరో: ఆధార్ నమోదులో సౌత్‌జోన్ పరిధిలోని రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఏపీలో ఇప్పటివరకూ 99 శాతం ఆధార్ నమోదైంది. సౌత్‌జోన్‌లో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు మినహా మిగిలిన చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, కేరళ, అండమాన్ నికోబార్‌లు 90 శాతానిపైగా నమోదును పూర్తి చేసుకున్నాయి. ఏపీలో పూర్తిస్థాయిలో ఆధార్ నమోదు కోసం 720 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పథకాలను పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేస్తుండడంతో నమోదు కీలకంగా మారింది. ఓటరు కార్డులతోపాటు రేషన్, గ్యాస్ తదితర అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ఆధార్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల భోగస్ లబ్దిదారులకు అడ్డుకట్ట పడుతోంది. అయితే రాష్ట్రంలో ఐరీష్, వేలిముద్రలు సరిగా నమోదవని కారణంగా పెన్షన్ల పంపిణీలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు నివారించేందుకే మొబైల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో గ్రీన్‌కార్డు తరహాలో మన దేశంలో ఆధార్ కార్డును ఉపయోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు యూఐడీఏఐ సౌత్‌జోన్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సీతారామిరెడ్డి చెప్పారు. ప్రాథమికరంగ మిషన్ వర్క్‌షాపులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు