తూతూ మంత్రం

8 Jun, 2015 01:05 IST|Sakshi

 ముగిసిన రెండో విడత  
 జన్మభూమి
 ప్రజాప్రతినిధుల
 హాజరు అంతంత మాత్రమే
 నామినేటెడ్ వరం దక్కక
 తగ్గిన ‘తమ్ముళ్ల’ హడావిడి

 
 ఏలూరు :జిల్లాలో రెండో విడత జన్మభూమి - మా ఊరు సభలు ఆదివారంతో తూతూ మంత్రంగా ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు 48 మండలాలు, ఏలూరు కార్పొరేషన్, ఏడు మునిసిపాలిటీలు, ఓ నగర పంచాయతీలోను కలిపి 1197 సభలను నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీన తణుకు మండలం వేల్పూరు గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. మండలాల్లో అయితే రోజుకు ఐదారు, పురపాలక సంఘాల్లో ఐదు నుంచి 10 వరకు సభలు జరిపారు. తక్కువ వ్యవధిలో పూర్తిచేసిన ఈ సభల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినవస్తున్నాయి.
 
 వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటి వరకు 50 వేలకు పైగా వినతులు వచ్చినట్టు సమాచారం. డ్వాక్రా పెట్టుబడి నిధి కింద రూ.197 కోట్లను మహిళలకు పంపిణీ చేయడమే ప్రధాన ఎజెండాగా జన్మభూమి సభలు సాగాయి. నామినేటేడ్ పదవులు ఇప్పటి వరకు వరించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు హడావుడి గ్రామసభల్లో పెద్దగా కనిపించలేదు. ఎమ్మెల్యేలు కూడా రుణాల పంపిణీ, పింఛన్ల మంజూరుకు సంబంధించిన పాసు పుస్తకాల పంపిణీ  పూర్తిచేసి వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు వారి నియోజకవర్గాల్లోని సభలకే పరిమితం అయ్యారు. ఎంపీలు కూడా తళుక్కుమని మెరిసి వెళ్లిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిన నేపథ్యంలో ఎక్కడ నిలదీత పర్వాలు ఎదురవుతాయోనన్న ఆందోళన ప్రజాప్రతినిధులను వెంటాడినట్టు అనిపించింది.
 
 అయితే ఎక్కువగా నిలదీతలు లేకపోవడంతో రెండో విడత జన్మభూమిని ముగించి ప్రజాప్రతినిధులు గట్టెక్కారు. జన్మభూమి సభల నిర్వహణకు రూ.కోటి సొమ్ము కరిగిపోవడం తప్ప ఓవరాల్‌గా పల్లెలు, పట్టణాల్లో పూర్తి స్థాయిలో సమస్యలను చర్చించే సమయం ఎవరికీ చిక్కలేదు. చివరిరోజు ఆదివారం ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని సభలకు హాజరయిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధు చెక్కులను పంపిణీ చేశారు. అయితే ‘జన్మభూమి అంటే పథకాల పంపిణీ కోసం కాదని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే’నని చెప్పడం కొసమెరుపు.
 

>
మరిన్ని వార్తలు