ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది ఆదుకోండి!

27 Jul, 2018 03:11 IST|Sakshi

కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు రాజకీయ సమాలోచనలు

టీడీపీ కార్యకర్తలుగా ప్రభుత్వ ఉద్యోగులు

పార్టీకి అనుకూలంగా ఉండే వారినే ఐటీ విభాగాల్లో నియమించాలి

దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి

ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల పనితీరుపై రహస్య నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు

సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. జిల్లా కలెక్టర్లు, కీలక శాఖల ఐఏఎస్‌లతో రాజకీయ సమాలోచనలు జరిపారు. ఇందులో భాగంగా బుధవారం, గురువారం కొన్ని జిల్లాల కలెక్టర్లు, కీలక శాఖల ఐఏఎస్‌లతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని, దీన్ని ఎలాగ అధిగమించాలో చెప్పాలని, మీరే సహకరించాలని కలెక్టర్లు, ఐఏఎస్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.

సహకరించే వారిని గుర్తు పెట్టుకుంటాం
జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల పనితీరు, వ్యవహార శైలిపై రహస్య నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి కోరారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ప్రతి ఓటర్‌కు ప్రభుత్వ పథకాల గురించి వాట్సాప్‌ ద్వారా తెలియ జేయాలని, జిల్లా స్థాయిలో ఐటీ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వారినే ఔట్‌సోర్సింగ్‌ కింద ఈ విభాగాల్లో నియమించాలని చంద్రబాబు సూచించారు. టీడీపీకి సహకరించే అధికారులను గుర్తు పెట్టుకుంటామని హామీ ఇచ్చారు.

ఆ బాధ్యత కలెక్టర్లదే..
ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందనే దానిపై ప్రతి 15 రోజులకోసారి రహస్య నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించామని, ఇది తమకు అత్యంత కీలక సమయమని, విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇటీవల అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలు పెంచామని, వీరంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పని చేసేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుందో సూచిస్తూ తనకు నివేదికలు అందజేయాలని చెప్పారు.

నిజాయతీపరులు లూప్‌లైన్‌లోకే...
ఎన్నికల సమయంలో కిందిస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించే ఉద్యోగులను ఎంపిక చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కలెక్టర్లు, ఐఏఎస్‌లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలుగా పనిచేసే తత్వం గల ఉద్యోగులను కిందిస్థాయిలో నియమించాలని, తటస్తులు, నిజాయతీగా పనిచేసే వారిని లూప్‌లైన్‌లో పడేయాలని ఆదేశించారు. తమ పార్టీకి సహకరించే ఉద్యోగులకు గ్రేడ్‌లు ఇవ్వాలని, వాటి ఆధారంగా ముఖ్యమంత్రి నుంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తుందంటూ నూరిపోయాలని చెప్పారు.

గ్రామాలు, నియోజవర్గాల వారీగా ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలన్నారు. అధికార టీడీపీ వ్యవహారాలను చంద్రబాబు చర్చించడంతో కలెక్టర్లు, ఐఏఎస్‌ అధికారులు విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని తన పార్టీ ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న చంద్రబాబు ఎత్తుగడను ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమన్న అభిప్రాయాన్ని కొందరు కలెక్టర్లు, ఐఏఎస్‌లు వ్యక్తం చేసినట్లు సమాచారం. 

>
మరిన్ని వార్తలు