మళ్లీ రహస్య సర్వే... 

12 Oct, 2019 08:57 IST|Sakshi

సాక్షి, టెక్కలి : అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం గ్రానైట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టెక్కలి పరిసర ప్రాంతాల్లో లభించే నీలి గ్రానైట్‌కు దేశ విదేశాల్లో ఎంతో గిరాకీ ఉంది. నందిగాం మండలం సొంటినూరు ప్రాంతం సర్వే నంబరు 1లో అతి విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి ఖరీదైన గ్రానైట్‌ను ఎలాగైనా దక్కించుకోవాలనే ఎత్తుగడలతో దిల్లీ, ముంబయ్‌కు చెందిన బడా కార్పొరేట్‌ సంస్థలు కొన్ని రహస్య సర్వేలకు మరోసారి సిద్ధమవుతున్నారు.

గతంలో టీడీపీ హయాంలో టీడీపీ రాష్ట్ర స్థాయి అగ్ర నాయకుడి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ రహస్య సర్వేలకు సహకరించినట్లు సమాచారం. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన కథనంతో రహస్య సర్వేలకు కొన్ని నెలలపాటు విరామం ఇచ్చారు. అయితే రాష్ట్రంలో టీడీపీ గల్లంతు కావడం... టీడీపీకి చెందిన కొంతమంది అగ్ర నాయకులు బీజేపీలో చేరడంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి రహస్య సర్వేలకు తెర తీస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పారదర్శకమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తమ రహస్య సర్వేలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదనే భయంతో కేంద్ర ప్రభుత్వం అండ ఉన్న కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకుని మరోసారి రహస్య సర్వేలకు తెగబడుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో కొన్ని రకాల ఆంక్షలు ఉన్నప్పటికీ ఆయా నిక్షేపాలను తీసేందుకు అడ్డంకులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఎలాగైనా విలువైన నీలి గ్రానైట్‌ నిక్షేపాలను సొంతం చేసుకునేందుకు దిల్లీ, ముంబాయ్‌కు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్‌ కంపెనీలు స్కెచ్‌ వేసినట్లు సమాచారం.   
 
అత్యాధునిక పరికరాలతో అర్ధరాత్రి రహస్య సర్వేలు 
సుమారు 1686 ఎకరాల విస్తీర్ణం కలిగిన సొంటినూరు కొండపై ఇప్పటికే సుమారు 75 ఎకరాల వరకు గ్రానైట్‌కు అనుమతులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతానికి సంబంధించి కొన్ని రకాల ఆంక్షలతో అనుమతులు నిలిచిపోయాయి. విలువైన ఖనిజ నిక్షేపాలను సొంతం చేసుకోవడానికి దిల్లీ, ముంబాయ్‌కు చెందిన కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు మరోసారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

అత్యాధునిక జర్మన్, జపాన్‌ టెక్నాలజీకు చెందిన శాటిలైట్, లేజర్‌ సర్వేలతో అర్ధరాత్రి సమయాల్లో రహస్య సర్వేలు చేసి బడా కంపెనీలకు అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయించి పై స్థాయి నుంచి ఒత్తిడితో గ్రానైట్‌ క్వారీ అనుమతులను దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన చెందిన రాష్ట్ర నాయకుని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోపాటు జాతీయ ఖనిజ సంస్థకు చెందిన అదే సామాజిక వర్గం అధికారితో కార్పొరేట్‌ సంస్థలు కుమ్మక్కై అప్పట్లో శాటిలైట్, లేజర్‌ సర్వేలు చేసిన విషయం బయట పడడంతో కొన్ని నెలలపాటు ఆ ప్రయత్నాలకు విరామం పలికారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న కొంతమంది నాయకుల అండతో మరోసారి రహస్య సర్వేలకు తెర తీసినట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో భాగంగా భూ అంతర్భాగం క్వారీయింగ్‌ విధానాన్ని అనుసరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భూమి లోపల సుమారు 500 నుంచి 800 మీటర్ల వరకు లేజర్‌ సర్వేలు నిర్వహించి నీలి గ్రానైట్‌ నిక్షేపాల ఖనిజాలను కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉన్న విలువైన నీలి గ్రానైట్‌ ఖనిజ సంపదపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈ సంపదను రాష్ట్రాభివృద్ధికి వినియోగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
 
రహస్య సర్వేల విషయంపై దృష్టి సారిస్తాం 
సొంటినూరు కొండపై రహస్య సర్వేల విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. సొంటినూరు పరిసర ప్రాంతాల్లో కొండల పై గ్రానైట్‌ నిర్వహణకు ఇప్పటికే కొన్ని దరఖాస్తులు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తాం. 
–కె.శంకర్రావు, మైన్స్‌ ఏడీ, టెక్కలి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా