ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

25 Apr, 2019 11:42 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం

జిల్లా ఎన్నికల అధికారి భాస్కర్‌

సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్పీ ఠాకూర్‌ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ఓట్ల లె క్కింపునకు చేయాల్సిన బందోబస్తు, సాధారణ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భం గా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అయిన కె.భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు.

ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బందికి వచ్చే నెల 17, 18, 20, 21 తేదీల్లో ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇస్తామని చెప్పారు. పార్లమెంటు, అసెంబ్లీల వారీగా పోల్‌ అయిన పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించేందుకు ఇతర కౌంటింగ్‌ అవసరాలకు అదనంగా మరో 60 మంది ఏఆర్‌వోలను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రతిపాదనలు పం పామని, వాటిని సత్వరమే ఆమోదించాలని కోరారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపునకు వేర్వేరు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నందున సాధారణ పరిశీలకులు వారున్న ఆవరణలోనే జరిగే నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు పరిశీ లించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రతి పాదనలు పంపామని వాటిపై కూడా తగిన సూచనలు జారీ చేయాలని అభ్యర్థించారు.

బోర్ల మరమ్మతులకు రూ.5 కోట్లు
ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ భాస్కర్‌ వివరించారు. సీఎంఎఫ్‌ఎస్‌ విధానం అమలులో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నందున బోర్ల మరమ్మతుల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరగడం లేదన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు స్థానిక సంస్థల నిధులను వెచ్చిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని తాగునీటి బోర్ల మరమ్మతులకు మెకానిక్‌ జీతాలు చెల్లించేందుకు వీలుగా సుమారు రూ.5కోట్లు మంజూరు చేశామని ఈ మేరకు ర్యాటిఫై చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. కాన్ఫరెన్స్‌లో సీపీ మహేష్‌ చంద్రలడ్హా, ఎస్పీ అట్టాడ బాపూజీ, జేసీ సృజన పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు