నిఘాపై నిర్లక్ష్యం

16 Dec, 2018 13:50 IST|Sakshi

అభివృద్ధికి నోచని పంపనూరు క్షేత్రం 

ఆలయంలో పనిచేయని సీసీ కెమెరాలు 

నిధులున్నా కొత్తవి ఏర్పాటు చేయడంలో తాత్సారం 

దాతల సహకారం కోసం దేవాదాయ సిబ్బంది ఎదురుచూపు 

ఆత్మకూరు: జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పంపనూరు ఒకటి. సర్పరూప సుబ్రమణ్యేశ్వర స్వామి కొలువైన ఈ ఆలయానికి జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఆది, మంగళవారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. ఎంతోమంది భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని ఆలయం చుట్టూ 108 ప్రదక్షణలు చేస్తుంటారు. ఆదాయం రూ.లక్షల్లో ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు.

 దేవాదాయ శాఖకు సుబ్రమణ్యస్వామి ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. ఆలయ అభివృద్ధిపై ఏమాత్రమూ ఉండటం లేదు. ఇక్కడ ఆలయ కమిటీ అనుబంధంగా అన్నదాన కమిటీ ఉన్నాయి. ప్రముఖ ఆలయంగా పేరొందినప్పటికీ ఇక్కడ ఎటువంటి భద్రతా ఏర్పాట్లూ లేవు. భక్తుల భద్రత, చోరీల నివారణ, అక్రమాలకు చెక్‌ పెట్టేందు కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గర్భగుడిలో ఏకంగా కుక్కలు, కోతులు సంచరిస్తున్నా పట్టించుకునే నాథులే లేరు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆది, మంగళ వారాల్లో మాత్రం ఓ కమిటీ సభ్యులు కనిపిస్తుంటారు. 

పనిచేయని సీసీ కెమెరాలు 
ఆలయం లోపల తక్కువ సామర్థ్యం కలిగిన తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మూడు పనిచేయడం లేదు. మిగిలిన ఆరు పనిచేస్తున్నప్పటికీ అందులో రికార్డవుతున్న దృశ్యాలలో స్పష్టత ఉండటం లేదు. ఫలితంగా ఎటువంటి ఉపయోగమూ లేకుండా పోతోంది. గర్భగుడి వద్ద సీసీ కెమెరాలు ఊడి గోడలకు వేలాడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆలయ ప్రాంగణంలో వాహనాలు నిలిపే చోట, రోడ్డు నుంచి ఆలయం వరకు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీని గురించి ఎవ్వరూ దృష్టి సారించడం లేదు.  

నిధులు వెనక్కేనా?  
ఆలయంలో తొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి. రెజల్యూషన్‌/ పిక్సెల్స్‌ తక్కువ సామర్థ్యం కావడంతో సీసీ ఫుటేజీల్లో ఏమాత్రం స్పష్టత కనిపించడం లేదు. వీటిని తొలగించి కొత్తగా 30 సీసీ కెమెరాల వరకు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ఇటీవల రూ.7.50 లక్షల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ పనులు కోసం ఇటీవల ఓపెన్‌ టెండర్‌ కూడా పిలిచారు. అయితే ఆ టెండర్‌ రద్దు అయినట్లు ఈఓ సుధారాణి తెలిపారు. దాతల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి, మంజూరైన దేవాదాయ నిధులను నొక్కేయాలనే ఆలోచనలో సిబ్బంది ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించకపోతే మాత్రం నిధులు వెనక్కుపోయే అవకాశం ఉంది.

నెలాఖరులోపు టెండర్లు  
ఆలయంలససీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎండోమెంట్‌ వారు రూ.7.50 లక్షలు మంజూరు చేశారు . వాటి కోసం ఇటీవల ఓపెన్‌ టెండర్లు పిలిచి రద్దు చేయించాం. కాని ఆ టెండర్లు రద్దు అయ్యాయి. ఈ నెల ఆఖరులోపు టెండర్లు పిలుస్తాం. 
– సుధారాణి, ఈఓ, పంపనూరు      

కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పాం 
సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఆది, మంగళ వారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రద్దీని నియంత్రించడానికి ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లను పంపుతున్నాం. కానీ దొంగతనాలు, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని గుర్తించడానికి అనుగుణంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పాం. 
– సాగర్, ఎస్‌ఐ, ఆత్మకూరు 

మరిన్ని వార్తలు