అన్నదాతకు చేరువలో కొత్త వంగడాలు

22 Feb, 2014 01:54 IST|Sakshi
అన్నదాతకు చేరువలో కొత్త వంగడాలు
  • వచ్చే ఏడాది మార్కెట్‌లోకి ఎంసీఎం 100, 101
  •  పరిశీలనలో ఎంసీఎం 103
  •  వ్యవసాయ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ వెల్లడి
  •  అన్నదాతకు కొత్త వంగడాలు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం, విపత్తులను తట్టుకోవడం లక్ష్యంగా వీటిని తయారుచేశారు. ఎంసీఎం 100, 101 పేరిట రూపొందించిన ఈ వంగడాలను వచ్చే ఏడాది మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. శుక్రవారం కరగ్రహారంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని సందర్శించిన హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.
     
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు నూతన వంగడాలను ఉత్పత్తి చేస్తున్నాయని హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి అన్నారు. మచిలీపట్నం కరగ్రహారంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని గుంటూరు లాం ఫామ్ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఇ.నారాయణతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు.  క్షేత్రంలో ఉన్న వసతులు, నూతన వంగడాలను తయారుచేసే విధానం తదితర అంశాలను పరిశీలించారు. కరగ్రహారంలో 19.50 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న వివిధ రకాల నూతన వంగడాలను, విత్తనశుద్ధి క్షేత్రాన్ని పరిశీలించి శాస్త్రవేత్తలకు పలు సూచనలు, సలహాలు అందించారు.
     
     మార్కెట్‌లోకి ఎంసీఎం 100, 101 వంగడాలు...
     హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
     
     ఎంసీఎం 100, 101 రకం వరి వంగడాలను వచ్చే ఏడాది మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.
     
     మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రం సీనియర్ సైంటిస్ట్ టి.అనురాధ పరిశోధించి వీటిని తయారుచేశారు.
     
     ఎంసీఎం 100 రకం 145 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. దీనిని ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసే వీలుంటుంది.
     
     ఎంసీఎం 101 రకం వరి వంగడం 125 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిని రబీ సీజన్‌లో సాగు చేసే వీలుంటుంది.
     
     మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తయారైన ఎంసీఎం 103 రకం వరి వంగడాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఇంకా నాలుగేళ్లు పడుతుంది.
     
     ఈ వంగడం ఇటీవల జరిగిన అంతర్జాతీయ పరిశోధన ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
     
     ఇది 140 రోజుల్లో కోతకు వస్తుంది.
     
     ఎంసీఎం 100 రకం వరి వంగడాన్ని ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో గత ఏడాది ఓ రైతు సాగు చేశారు.
     
     పదిరోజుల పాటు ఈ పైరు నీటిలోనే ఉన్నా ఎలాంటి పంట నష్టం వాటిల్లలేదని రుజువైంది.
     
     ఈ రకం వంగడాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, దీనికి మరింత సాంకేతికత జోడించి తుది మెరుగులు దిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాజారెడ్డి వెల్లడించారు.
     
     పరిశోధనలకు రూ.16.50 కోట్లు విడుదల...
     వ్యవసాయ పరిశోధనల నిమిత్తం గతంలో ప్రభుత్వం రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని రాజారెడ్డి చెప్పారు. తొలి విడతగా రూ.16.50 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ నిధులతో గుంటూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నిర్మించామన్నారు. రూ.23 లక్షల వ్యయంతో గుంటూరు లాం ఫామ్‌లో పాలికార్బోనెట్ హౌస్‌ను ఏర్పాటు చేసి వివిధ రకాల పంటలపై పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు.
     
     పరిశోధన క్షేత్రంలో సౌకర్యాలు కల్పించండి...
     మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో సాగునీటి సమస్య అధికంగా ఉందని, దీని నివారణ కోసం క్షేత్రంలో చెరువును తవ్వించేందుకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త టి.అనురాధ అధికారులను కోరారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, పనిచేస్తున్న వారంతా డెప్యుటేషన్ పైనే ఉన్నారని తెలిపారు. రెగ్యులర్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రాజారెడ్డి స్పందిస్తూ కావాల్సిన వసతులపై నివేదిక పంపితే పరిశీలించి నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో బ్రీడర్ దశలో ఉన్న ఎంసీఎం 103 సెమినార్‌ను ఆయన పరిశీలించారు.
     

మరిన్ని వార్తలు