విత్తన విక్రయం... ప్రశ్నార్థకం

4 May, 2017 10:02 IST|Sakshi
విత్తన విక్రయం... ప్రశ్నార్థకం

► గతేడాది ఏపీసీడ్స్‌లో రూ.50 కోట్లకు విక్రయాలు
► ఈ ఏడాది ఒక్క బస్తా విక్రయించలేని పరిస్థితి

శ్రీకాళహస్తి: తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి ఏపీసీడ్స్‌ కీలకంగా మారింది. రాష్ట్ర విత్తనశుద్ధి సంస్థ(ఏపీసీడ్స్‌)లో ప్రాసెసింగ్‌(విత్తనశుద్ధి) చేసిన వరి విత్తనాలను ఇతర జిల్లాలకు విక్రయించాలా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ప్రాసెసింగ్‌ను ప్రారంభించారు. ప్రధానంగా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్‌ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు మినహా మిగిలిన అన్ని జిల్లాకు శ్రీకాళహస్తి నుంచి వరి విత్తనాలు మూడేళ్లుగా పంపుతున్నారు.

గతేడాది రూ.50 కోట్ల మేరకు వరి విత్తనాలు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వరి విత్తనాలు శ్రీకాళహస్తి నుంచి పంపించారు. దీంతో ఏపీసీడ్స్‌కు మంచి ఆదాయం లభించిందని అప్పట్లో అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది కూడా శ్రీకాళహస్తి ఏపీసీడ్స్‌ నుంచి ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు తమిళనాడుకు పంపాలని భావించారు. ఈ మేరకు గత అక్టోబర్, నవంబర్‌లో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

గతేడాది 98వేల క్వింటాళ్లు వరిధాన్యం వచ్చిందని, ఈ ఏడాది రబీ సీజన్‌లో లక్ష పది క్వింటాళ్లు వరి ధాన్యం వస్తుందని అధికారులు భావించారు. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. దీంతో ఏపీసీడ్స్‌కు రైతుల నుంచి కేవలం 32వేల క్వింటాళ్లు మాత్రమే వరి విత్తనాలు వచ్చాయి. ప్రతిఏటా మార్చిలోనే వాటిని ప్రాసెసింగ్‌ చేసి, ఇతర జిల్లాలకు విక్రయించేవారు. గతేడాది మార్చి లోనే రూ.2 కోట్ల విలువైన విత్తనాలు ఇతర జిల్లాకు విక్రయించిన విషయం తెలిసిందే.

తక్కువ ధాన్యం రావడంతో మే 1వ తేదీ నుంచి విత్తనాల ప్రాసెసింగ్‌ ప్రారంభించారు. ప్రాసెసింగ్‌ అయిన విత్తనాలను ఇతర జిల్లాలకు విక్రయిస్తే, స్థానికంగా రైతులకు రబీలో విత్తనాల కొరత తలెత్తే ప్రమాదం ఉందని, దీంతో బయట జిల్లాలకు కొంతమేరకు విత్తనాలు విక్రయిం చాలా, వద్దా అనే విషయం సందిగ్ధంగా మారింది. మొత్తం మీద వర్షాలు లేకపోవడంతో ఏపీసీడ్స్‌కు ఆశించిన మేరకు వరిధాన్యం రాకపోవడంతో ఏపీసీడ్స్‌కు కష్టాలు తప్పడంలేదు.

మరిన్ని వార్తలు