సాగుతూ..ఆగుతూ..

29 Aug, 2015 01:18 IST|Sakshi
సాగుతూ..ఆగుతూ..

ఆశించిన స్థాయిలో పడని వరినాట్లు
జలాశయాల పరిధిలో 20శాతమే
ఆందోళన కలిగిస్తున్న ఖరీఫ్
అధికారుల లెక్కలు మాత్రం వేరు

 
విశాఖపట్నం: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి మట్టాలు లేకపోవడంతో వాటి పరిధిలోని ఆయకట్టులో వరినాట్లు ముందుకుసాగడంలేదు. పరీవాహక ప్రాంతాల్లో  ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. నీటిపారుదలశాఖ అధికారుల లెక్కల ప్రకారం 20శాతానికి మించలేదు. వర్షాధార ప్రాంతంలో మాత్రం 90 శాతం మేర నాట్లు పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ సీజన్ ముగుస్తున్నా..నాట్లు పూర్తికాకపోవడంతో ఈ ప్రభావం దిగుబడిపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వరిసాగు లక్ష్యం 2.65లక్షల ఎకరాలు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో 75,762 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ పరిధిలో 2.86లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 1.25లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టాలి. వర్షాధారంగా 65,233 ఎకరాల్లో నాట్లు వేశారు. తాండవప్రాజక్టు పరిధిలో ప్రస్తుతం 6.60 టీఎంసీల  నీరు ఉంది. 496 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఈ ప్రాజెక్టు పరిధిలో 32,689 ఎకరాల ఆయకట్టు ఉండగా..నీరు విడుదల చేయకముందే వర్షాధారంగా సుమారు  రెండువేలఎకరాల్లో నాట్లు వేశారు. రైవాడ, కోనాం, పెద్దేరు పరిధిలో 42,873 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 22,420 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇక మైనర్ ఇరిగేషన్ పరిధిలో 2,86,538 ఎకరాల ఆయకట్టుకు కేవలం 57,605 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. ఇప్పటి వరకు 80 శాతం విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖాధికారులు చెబుతుంటే..60 శాతం మేర మాత్రమే నాట్లుపడ్డాయని క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించే ముఖ్యప్రణాళికావిభాగం అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులు, సాగునీటి వనరుల పరిధిలో కేవలం 20శాతం విస్తీర్ణంలోనే నాట్లు పడ్డాయని ఇరిగేషన్ అధికారులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. ఎవరి లెక్కలు వాస్తవమో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.
 

మరిన్ని వార్తలు