జలకళ తప్పింది

26 Mar, 2018 13:07 IST|Sakshi
డొంకరాయి రిజర్వాయర్‌లో అడుగంటిన నీటిమట్టం

సీలేరు జలాశయాల్లో అడుగంటిన నీటిమట్టాలు

పైకి తేలుతున్న మట్టిదిబ్బలు

డెల్టాకు నీటి సరఫరాపై నీలినీడలు  

మోతుగూడెం (రంపచోడవరం):ఇంకా పూర్తి స్థాయిలో వేసవి రాకముందే సీలేరు జలాశయాలు కళ తప్పాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్ధితి ఏర్పడలేదు. ముఖ్యంగా సీలేరు జలవిద్యుత్‌ కేంద్రాలకు సంబంధించి గుంటవాడ, డొంకరాయి, ఫోర్‌బే రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఏటా మార్చి నాటికి ఈ మూడు రిజర్వాయర్లలో 10 నుంచి 15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. కానీ ఈసారి ఇప్పటికే నీటిమట్టాలు దారుణంగా పడిపోయి, మట్టిదిబ్బలు పైకి కనిపిస్తున్నాయి.

మరో పది రోజుల్లో ఈ రిజర్వాయర్లలో ఉన్న మూడు టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు తరలిస్తే పరిసర గ్రామాలకు తాగునీటి సమస్య ఎదురు కానుంది. బలిమెల రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి గట్టెక్కె పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి డెల్టాకు మరో 10 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంది. బలిమెల రిజర్వాయర్‌ నుంచి 10 టీఎంసీల నీటి విడుదలకు కోరినా ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే బలిమెల రిజర్వాయర్‌ ఆంధ్రా టన్నెల్‌ నుంచి అధిక మొత్తంలో నీరు దిగువన ఉన్న సీలేరు కాంప్లెక్స్‌ జలాశయాలకు వచ్చింది. దీంతో అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్టాలో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం పరంగా చర్చలు జరిగితేనే కానీ బలిమెల నుంచి నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా