హైదరాబాద్ను యూటీ చేయాల్సిందే: సీమాంధ్ర మంత్రులు

18 Nov, 2013 16:09 IST|Sakshi

ఐదు కోట్ల మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకు కుదిరిందని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. హైదరాబాద్, నీళ్లు, ఉద్యోగాలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై తాము జీవోఎంతో చర్చించామని ఆయన చెప్పారు. అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే జరిగిందని, అందువల్ల హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాండిచ్చేరి తరహాలోనే హైదరాబాద్ పాలన ఉండాలన్నారు. సీమాంధ్రలోని ప్రతి విద్యార్థి హైదరాబాద్ కావాలంటున్నాడని చెప్పారు. ఉమ్మడి రాజధాని హెచ్ఎండీఏ పరిధి వరకు ఉండాలని కోరామన్నారు. విభజన వల్ల వచ్చే సమస్యలను తెలిపామని, సమస్యలు పరిష్కరించాకే ముందుకెళ్లాలన్నామని అన్నారు. హైదరాబాద్లో మరో నగరం అభివృద్ధి చెందేవరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పినట్లు తెలిపారు.

విభజన అనివార్యమైతే సీమాంధ్రుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తాము మూడు నెలల నుంచి చెబుతున్నామని, ఇప్పుడు కూడా రాయలసీమ నీటి సమస్యను ప్రస్తావించామని అన్నారు. హైదరాబాద్లో 30 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల మాటేమిటని తాము కేంద్ర మంత్రుల బృందం సమావేశంలో ప్రస్తావించామన్నారు. జీవోఎంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర  మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చిన మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం తదితరులు విలేకరులతో మాట్లాడారు. అయితే.. శీలం మాట్లాడుతుండగానే మరో ముగ్గురు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పళ్లంరాజు కూడా మీడియాతో మాట్లాడలేదు.

మరిన్ని వార్తలు