ప్యాకేజీకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఓకే!

6 Nov, 2013 04:35 IST|Sakshi
ప్యాకేజీకి సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఓకే!

ఇన్నాళ్ల సమైక్యవాదమంతా బూటకమే
వ్యతిరేకతను తట్టుకోవడానికి ‘ప్యాకేజీ’ డ్రామా
సోనియా డెరైక్షన్.. చంద్రబాబు అడుగుజాడల్లో..
సీమాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ కోరాలని నిర్ణయం
నేడు ప్రధానికి, రేపు జీవోఎంకు వినతిపత్రం

సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల సమైక్యవాదం బూటకమేనని, ఆ ముసుగులో వారు ఇన్నాళ్లుగా చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. విభజనకు అనుకూలంగా కేంద్ర మంత్రుల బృందం ముందుకు వెళ్లాలని మంగళవారం వారు తీసుకున్న నిర్ణయంతో వారి అసలు రూపం బయటపడింది. దాంతో, సోనియాగాంధీ డెరైక్షన్‌లో విభజన ప్రక్రియలో ఒక్కో ఘట్టంలో ఒక్కోలా సీమాంధ్ర కేం ద్ర మంత్రులు ఆడిన నాటకాలకు కూడా తెరపడింది.

సోనియా డెరైక్షన్‌లో, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడుగుజాడల్లో పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఈ నాటకాన్ని రక్తి కట్టించడంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇంతకాలంగా తమ వంతు పాత్రను విజయవంతంగా పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజనకు బహిరంగంగా అంగీకారం తెలపాలని మం త్రులు కావూరి సాంబశివరావు, ఎంఎం పల్లంరాజు, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, కిల్లికృపారాణి నిర్ణయించారు. వారంతా మంగళవారం కావూరి కార్యాలయంలో సమావేశమై భావి కార్యాచరణపై చర్చిం చారు. విభజనకు అంగీకరిస్తూ జీవోఎం ముందుకు వెళ్లడానికి అవసరమైన భూమిక తయారీకి కసరత్తు చేశారు. విభజనను సమర్థించడంతో పాటు సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీ సాధనకు ప్రయత్నించాలని నిర్ణయించారు. దానికోసం గట్టిగా ప్రయత్నిస్తున్నామనే సంకేతాలు పంపించడం ద్వారా... ప్రజల్లో తమ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తగ్గించాలని ప్రణాళిక రూపొందించారు. సీమాంధ్రకు భారీగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు, నిధులు, పన్నుల మినహాయింపు, ఉపాధి కల్పన ప్రాజెక్టులు తదితరాలు ఇవ్వాలంటూ వినతిపత్రం రూపొందించాలని నిర్ణయించారు. ఈ జాబితాను బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి అందజేయనున్నారు. గురువారం నాటి జీవోఎం భేటీలో కూడా దాన్ని సమర్పించాలని నిర్ణయించారు. జీవోఎంకు నివేదిక ఇవ్వడంపై ఎలాంటి చర్చా చేయలేదని భేటీ అనంతరం పనబాక చెప్పారు. సమైక్యాంధ్ర కోసం మరోమారు ప్రధాని, సోనియా, రాహుల్‌లను కలుస్తామన్నారు.
 
 దిగ్విజయ్‌తో శీలం, కేవీపీ మంతనాలు
 కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో శీలం, ఎంపీ కేవీపీ రామచంద్రరావు మంగళవారం విడిగా భేటీ అయ్యారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్లడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారని చెప్పారు. కనీసం బిల్లునైనా అసెంబ్లీకి పంపుతారా, లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోందన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. విభజనతో ముడిపడిన ప్రధాన సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే వేగంగా ప్రక్రియను ముగించడాన్ని తప్పుబట్టారంటున్నారు. సీమాంధ్రకు సమన్యాయం ఎలా చేస్తారో చెప్పకుండా, ఏమేం కావాలో చెప్పాలంటే ఎవరూ ముందుకు రారని చెప్పారని సమాచారం. సీమాంధ్రకు న్యాయం చేసే అన్ని అంశాల ప్రస్తావనా పీసీసీ తరఫున జీవోఎంకు ఇచ్చే నివేదికలోనే ఉంటుందని దిగ్విజయ్ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. తెలుగుజాతి ఔన్నత్యం, పురోగతి సమైక్యాంధ్రలోనే సాధ్యమని అనంతరం కేవీపీ మీడియాతో అన్నారు.
 
 మంత్రుల విన్నపాలివీ..
 - హైదరాబాద్‌పై అన్ని ప్రాంతాల ప్రజలకూ సమాన హక్కు కల్పించాలి. అందుకు దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
 - సీమాంధ్రలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి
 - జల వివాదాల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
 - సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు కేంద్రం భారీగా ఆర్థిక సాయం అందించాలి
 - రెండు దశాబ్దాల పాటు సీమాంధ్రకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి
 - 20 ఏళ్ల పాటు కేంద్రం నుంచి ఏటా నిర్దిష్ట మొత్తంలో సీమాంధ్రకు నిధులు వచ్చేలా స్పష్టమైన హామీ ఇవ్వాలి
 - ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) తరహాలో ప్రత్యేక వైద్య, పరిశోధన విద్యా సంస్థలను నెలకొల్పాలి
 - వాల్తేరును ప్రత్యేక రైల్వే డివిజనుగా ప్రకటించాలి
 - తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలి
 - పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(పీసీపీఐఆర్) అభివృద్ధికి తగిన నిధులివ్వాలి
 - విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్టు మంజూరు చేయాలి
 - రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల వెనకబాటుతనం నిర్మూలనకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలి
 - విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఐటీఐఆర్ నెలకొల్పాలి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా