విద్యుత్ సమ్మెలో సడలింపు

12 Sep, 2013 02:13 IST|Sakshi
విద్యుత్ సమ్మెలో సడలింపు

* సీఎంతో భేటీ తర్వాత సేవ్ జేఏసీ నిర్ణయం
* నిరవధికం కాదు.. బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మె
* సీమాంధ్రలో అత్యవసర సేవలు మినహా ఇతర విధులకు దూరం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరవధిక సమ్మెను సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు సడలించారు. 11వ తేదీ అర్ధరాత్రి నుంచి మూడురోజులు (72 గంటలు) మాత్రమే సమ్మె చేయనున్నట్టు సమైక్య ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల (ఎస్‌ఏవీఈ-సేవ్) సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సేవ్ జేఏసీ నేతలు సాయిబాబా, శ్రీనివాస్, నర్సింహులు, అనురాధ తదితరులు తెలిపారు. మూడురోజుల పాటు ఆసుపత్రులు, వ్యవసాయం, మంచినీటి సరఫరా, ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి వంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులకు దూరంగా ఉంటామని చెప్పారు.

బుధవారం సాయంత్రం జేఏసీ నేతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని సీఎం వారిని కోరారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా ఆగిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతారని.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీఎన్‌జీవోలతోనూ సమ్మె విరమణపై చర్చిస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అయితే కేంద్ర కేబినెట్ ముందుకు విభజన నోట్ వచ్చిన వెంటనే నిరవధిక సమ్మె చేస్తామని నేతలు పేర్కొనగా.. అసెంబ్లీ ముందుకు విభజన తీర్మానం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరినట్టు తెలిసింది. 
 
ఆద్యంతం నాటకీయం
విద్యుత్ ఉద్యోగుల సమ్మె విషయంలో బుధవారం అద్యంతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్‌కో విజయానంద్ ఎండీలు మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్‌సౌధలో మీడియా ద్వారా ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ కూడా సమావేశంలో పాల్గొన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదని.. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో జల విద్యుత్ పెరిగి విద్యుత్ సరఫరా మెరుగుపడిన పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లడం వల్ల మళ్లీ విద్యుత్ సరఫరా సమస్య తలెత్తుతుందని అన్నారు.

అందుకు అంగీకరించని జేఏసీ నేతలు సమ్మె విషయమై చర్చించేందుకు సమయం కావాలని సీఎంను కోరారు. గురువారం ఉదయం 10.30కి సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో విజయానంద్ మధ్యవర్తిత్వం నెరపి సీఎంతో ఉద్యోగులు బుధవారం సాయంత్రమే సమావేశమయ్యేలా చూశారు. సీఎంతో చర్చల అనంతరం సమ్మెను సడలిస్తూ ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నారు.

రెండు రోజుల్లో ఆర్‌టీపీపీ పునరుద్ధరణ
ఆర్‌టీపీపీలో విద్యుత్ సరఫరాను రెండు మూడు రోజుల్లో పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని జెన్‌కో ఎండీ విజయానంద్ బుధవారం తెలిపారు. భారీ వర్షాల వల్ల కోల్ హ్యాండ్లింగ్, పంప్‌హౌస్‌ల్లోకి నీరు ప్రవేశించిందని తెలిపారు. అప్పటికే ఒక యూనిట్‌లో మరమ్మతులు చేస్తున్నామని, నీరు రావడం వల్ల మిగతా నాలుగు యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశామని చెప్పారు.

మరిన్ని వార్తలు