సోనియా క్విట్ ఇండియా..

8 Oct, 2013 01:35 IST|Sakshi
సోనియా క్విట్ ఇండియా..

సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సోమవారం సచివాలయం పాత ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి  ‘సోనియా క్విట్ ఇండియా.. ప్యాకేజీలు వద్దు సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో సచివాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమతా బ్లాక్ ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. అంతకుముందు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చల్లో పాల్గొన్నారు. ఈనెల 9న సీఎంతో సమావేశం కానున్నామని, రాష్ట్ర విభజన నిలిపివేయడంపై స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య తెలిపారు.
 
 విద్యుత్ సౌధలో పోటాపోటీ ఆందోళనలు
 సీమాంధ్ర, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు సోమవారం విద్యుత్ సౌధలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. సమ్మెలో పాల్గొంటున్న అసాంఘిక శక్తులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ రఘు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యుత్‌సౌధకు వచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సాయిబాబా స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు