వెళ్లవయ్యా.. వెళ్లూ!

11 Sep, 2013 04:30 IST|Sakshi
వెళ్లవయ్యా.. వెళ్లూ!
సాక్షి నెట్‌వర్క్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. మంగళవారం ఆయా పార్టీల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడకనిపిస్తే అక్కడ సమైక్యవాదులు అడ్డుకున్నారు. నిరసన దీక్షా శిబిరాల వద్దకు వస్తున్న నేతలను గో బ్యాక్ అంటూ తిప్పిపంపారు. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద నిర్వహించిన మాక్ కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ వీరభద్రస్వామిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విశాఖలో జీవీఎంసీ ఎదురుగా రిలేదీక్షలు చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిని అడ్డుకోగా, ‘నేను రాజీనామా చేసేశా’.. అని చెప్పడంతో శాంతించారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో  మంత్రి  పితాని సత్యనారాయణను విద్యార్థి సంఘాల నేతలు ఘెురావ్ చేశారు. కొవ్వూరులో ఎమ్మెల్యే టీవీ రామారావు ఇంటిని ముట్టడించారు. 
 
 
 మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు శ్రీకాకుళం జిల్లా పాలకొండ,  సంతకవిటి మండల కేంద్రంలో ప్రతిఘటన ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పొలకొండ ఏలాం కూడలిలో  మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కాన్వాయ్‌ని సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు అడ్డుకున్నారు. మంత్రి వాహనం దిగి రాగా, సీమాంధ్ర ద్రోహి అని తిట్ల వర్షం కురిపించారు. శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి వ్యతిరేకంగా ఉద్యమకారులు నినాదాలు చేశారు.
 
మరిన్ని వార్తలు