ఆఖరి నిమిషంలో సీమాంధ్ర నేతల హడావుడి

31 Jul, 2013 02:23 IST|Sakshi
మంగళవారం ఢిల్లీలో సోనియా నివాసం నుంచి బయటకు వస్తున్న జేడీ శీలం, మాగుంట, అనంత వెంకట్రామిరెడ్డి, పళ్లంరాజు, చిరంజీవి, లగడపాటి
  • సోనియా, దిగ్విజయ్‌లతో సీమాంధ్ర నేతల భేటీలు
  • విభజిస్తే సీమాంధ్రలో పార్టీ బతికి బట్టకట్టదన్న నేతలు
  • నిర్ణయం జరిగిపోయిందన్న సోనియా
  • రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఆఖరి నిమిషంలో ప్రయత్నాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించారు. మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లను కలిసి తమ మనోగతాన్ని వారి ముందుంచారు.
     
    ఎస్సార్సీ ద్వారానే సమస్యకు పరిష్కారం చూపాలని సీమాంధ్ర నేతలు బలంగా వాదన విన్పించినట్టు తెలుస్తోంది. ఒకవేళ విభజనే అనివార్యమైతే హైదరాబాద్ విషయంలో తమకు భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని ముక్తకంఠంతో కోరినట్టు సమాచారం. ఓ దశలో మంత్రి పదవులకు, ఎంపీ పదవులకు రాజీనామా చేయడానికి కూడా వారు సిద్ధపడినట్టు ప్రచారం జోరుగా సాగింది. అయితే సోనియా, దిగ్విజయ్‌లతో భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు శాంతి, సంయమనం పాటించారు. విభజన నిర్ణయం వెలువడితే భావి కార్యచరణపై విసృ్తత భేటీలు నిర్వహించి చర్చోపచర్చలు కొనసాగించారు.
     
    సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు మంగళవారం ఉదయం 10 గంటలకు టీటీడీ చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజు నివాసంలో భేటీలు జరిపారు. కేంద్ర మంత్రులు ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, చిరంజీవి, జేడీ శీలం, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, కేవీపీ రామచంద్రరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. అధిష్టానం తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని తీసుకుంటే ఆ తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించారు.
     
    రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించరాదని, విభజిస్తే తలెత్తే దుష్పరిణామాలను అధిష్టానానికి తెలియజేసేందుకు సోనియా, రాహుల్, దిగ్విజయ్ అపాయింట్‌మెంట్లు కోరారు. దిగ్విజయ్ నివాసానికి వెళ్లి తమ వాదన విన్పించారు. రాష్ట్ర విభజనకు ప్రతిపాదిక ఏమిటని ఆయనను అడిగారు. విభజన జరిగితే గూర్ఖాలాండ్, విదర్భ సహా ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లు తెరపైకి వస్తాయన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలున్నాయని దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. సీమాంధ్రులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం వెలువడినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడతారనే విషయాన్ని తెలియజేశారు.

    విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమేనని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చేపరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. విభజనపై సోనియా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, అందుకు అందరూ కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ ఆదేశించారు. ఇంకేమైనా చెప్పదల్చుకుంటే మేడమ్‌ను కలిసి చెప్పుకోవాలని సూచించారు. దాంతో సీమాంధ్ర నేతలు 10, జన్‌పథ్‌కు వెళ్లి సోనియాతో 35 నిమిషాల పాటు సమావేశమయ్యారు. విభజన జరిగితే ఎదురయ్యే పరిస్థితులను ఏకరువు పెట్టారు. సీమాంధ్రలో కాంగ్రెస్ మనుగడ కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, నదీ జలాల అంశాలనూ ప్రస్తావించినట్టు సమాచారం. కాంగ్రెస్ విసృ్తత ప్రయోజనాలు, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సోనియాను కోరారు. నిర్ణయం జరిగిపోయిందని ఆమె బదులిచ్చారు. అది అందరికీ న్యాయం జరిగేలా ఉంటుందని మేడమ్ భరోసా ఇచ్చినట్టు సీమాంధ్ర నేతలు చెప్పారు.
     
    ప్రజలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యం: చిరంజీవి
    సోనియాతో భేటీ అనంతరం చిరంజీవి, పళ్లంరాజు, శీలం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. పార్టీ భవిష్యత్, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సోనియాను కోరినట్టు చిరంజీవి చెప్పారు. రాజీనామాలకు ఇప్పుడే సమయం రాలేదన్నారు. ‘‘ఎన్నికల్లో గెలుస్తామా, గెలవమా, మా భవిష్యత్తేమిటి అన్నవి ముఖ్యం కాదు. పార్టీ భవిష్యత్తు, మనుగడ ముఖ్యం. వీటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి’’ అని సోనియాకు నివేదించామన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా, ఎవరికీ అసంతృప్తి కలిగించని విధంగా అధిష్టానం నిర్ణయం ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేస్తామని సోనియా భరోసా ఇచ్చారన్నారు.
     
     విభజనకు అనుకూలంగా నిర్ణయం వస్తే రాజీనామా చేస్తారా అని అడగ్గా నిర్ణయాన్ని రానివ్వండన్నారు. రాజీనామాలతో సమస్యకు పరిష్కారం లభించదని శీలం అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చాలా ప్రక్రియ ఉందని, ఎవరూ ఆవేశాలకు లోనుకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అంతకుముందు ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి సైతం రాజీనామాలు పరిష్కారం కాదని, పార్టీలోనే ఉండి సమైక్యం కోసం తుదికంటా పోరాడుతామని చెప్పారు. ఎంపీ లగడపాటి మాట్లాడుతూ విభజన జరిగితే రాజకీయాలనుంచి తప్పుకుంటాననే మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని పురందేశ్వరి అన్నారు. ‘మీసాలున్నాయి గానీ తెలంగాణను ఆపే శక్తి లేదు’ అని కనుమూరి వ్యాఖ్యానించారు.
     

>
మరిన్ని వార్తలు