ఆమోదం పొందే వరకూ అప్రమత్తం

29 Oct, 2013 05:57 IST|Sakshi

తెలంగాణను అడ్డుకునేందుకు ఢిల్లీలో సీమాంధ్రుల లాబీయింగ్
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేం దుకు సీమాంధ్ర నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ స్థాయిలో పెద్దఎత్తున లాబీ యింగ్ చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ‘తెలంగాణ స్టేట్-ఇన్‌పుట్స్ టు జీఓఎం’ అనే అంశంపై‘యూనివర్సిటీ టీచర్స్ ఫోరం ఫర్ తెలంగాణ’ ఒక సమావేశం నిర్వహించింది. అందులో కేశవరావు, విద్యావేత్త చుక్కా రామయ్య, పలువురు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఫోరం కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించిన సమావేశంలో విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్టికల్ 371(డి), పింఛన్లు, వర్సిటీలు, నిధులు, నీళ్ళు, విద్యుత్తు, వనరులు, భూములు, రుణాలు, చెల్లింపులు, శాంతిభద్రతలు, రెవిన్యూ తదితర అంశాలపై చర్చలు జరిపారు. జీఓఎంకు పూర్తి వివరాలతో త్వరలో నివేదికను అందచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు ఉండాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, మాజీ ఎంపీ వినోద్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, విమలక్క, ఔటా అధ్యక్షులు భట్టు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ప్రొ.రాములు, ప్రధాన కార్యదర్శి ప్రొ.మనోహార్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు