ఒత్తిడిలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు

2 Sep, 2013 02:07 IST|Sakshi
  • రాజీనామా చేయకుంటే  సీమాంధ్రలో అడుగుపెట్టలేని పరిస్థితి
  •   సీఎంను కలిసిన కృపారాణి, శైలజానాథ్, గాదె, జేసీ, ఉండవల్లి, అనంత
  •   వైఎస్సార్‌సీపీ, టీడీపీ వైఖరిపై చర్చ
  •   ఏపీ ఎన్జీవోలకు జీతాలు చెల్లించాలని కోరిన శైలజానాథ్
  •   పనిచేసిన కాలానికి జీతాలిచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నామన్న సీఎం
  •  సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఉధృతమవుతున్న సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీవ్ర మైంది. విభజనకు కాంగ్రెస్ కారణమైనందున ఆ ప్రాంత ప్రజలంతా తమను దోషులుగా పరిగణిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు రాజీనామాలు చేసి రావాలని చెబుతున్న సమైక్యవాదులు తాజాగా రాజీనామాలను ఆమోదించుకున్న తరువాతే నియోజకవర్గంలో కాలుపెట్టాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం విభజన విషయంలో వెనక్కువెళ్లే ప్రసక్తేలేదని తేల్చిచెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్‌ను కలిసి రాజీనామాను ఆమోదించుకునే పనిలో పడటంతో వీరిపై ఒత్తిడి మరింత అధికమైంది. దీనిని ఏ విధంగా అధిగమించాలనే అంశంపై చర్చించేందుకు సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, మాజీమంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు.
     
     సీమాంధ్ర ప్రజల ఒత్తిడిని అధిగమించి రాజకీయంగా మనుగడ సాధించాలంటే తెలంగాణ ప్రక్రియను అడ్డుకోవడం ఒక్కటే మార్గమని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాల తరువాత తెలంగాణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసే అవకాశాలున్నందున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్నందున అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని, దీంతో టీడీపీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించే బాధ్యతను తాము తీసుకుంటామని... పార్లమెంటులో, కేంద్రంలో తెలంగాణ ప్రక్రియ జరగకుండా చూసే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకోవాలని సీఎం, శైలజానాథ్ కోరినట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ ఆపడానికి ఎంతదూరమైనా వెళ్లేందుకు తాము సిద్ధమయ్యామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు శైలజానాథ్ ఈనెల మూడో తేదీన అసెంబ్లీ ఆవరణలో జరపతలపెట్టిన సత్యాగ్రహ దీక్ష అంశాన్ని సీఎంకు వివరించారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలకు జీతాలు చెల్లించాలని కోరారు.
     
     గత నెలలో వారు 12 రోజులపాటు పని చేసినందున కనీసం ఆ కాలానికైనా జీతాలు చెల్లించే విషయాన్ని ఆలోచిస్తున్నామని సీఎం బదులిచ్చినట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సీఎంను కలిసి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ పెద్దలందరినీ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యమ తీరును వివరించనున్నారు. అదే విధంగా ఈనెల 3న ఏకే ఆంటోనీ కమిటీతోనూ బొత్స సమావేశం కానున్నారు.
     
     నేడు సోనియాను కలవనున్న డీఎస్
     పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా సోమవారం హస్తిన పయనమవుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆయన సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతర పరిణామాలు, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి వంటి అంశాలను వివరించే అవకాశాలున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలతోపాటు సీమాంధ్ర ఉద్యమాన్ని వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి ఎంపీలు కూడా ఈనెల 3న ఆంటోనీ కమిటీని కలిసి విభజన ప్రక్రియను కొనసాగించడంవల్ల జరగబోయే పరిణామాలను, పార్టీకి జరిగే నష్టాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు