విభజనకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేరు: సబ్బం హరి

21 Dec, 2013 14:46 IST|Sakshi

రాష్ట్ర విభజనకు సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు అనుకూలంగా లేరని అనకాపల్లి  ఎంపీ సబ్బం హరి అన్నారు. ఢిల్లీలో జరగుతున్న రాజకీయ క్రీడకు తెలుగు ప్రజలు బలయ్యారని ఆయన పేర్కొన్నారు. బిల్లుపై అసెంబ్లీలో కచ్చితంగా చర్చ జరగాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అబిడ్స్లోని ఏపీఎన్జీవో భవన్లో శనివారం జరిగిన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ మరో సారి పునరాలోచన చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐక్యత కోసం ఏపీఎన్జీవోలు చేసే పోరాటంలో అన్ని పార్టీలు సహయ సహకారాలు అందించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ వెల్లడించారు.



భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలకు హాజరై సమైక్య నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఎన్జీవోలు గతంలో చేసిన 66 రోజుల ఉద్యమంతో కేంద్రానికి ముందల కాళ్లకు బంధం వేసిన సంగతిని ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు గుర్తు చేశారు. పదవుల్లో కొనసాగుతున్న కేంద్రమంత్రులు తమ మనస్సులను మార్చుకోవాలని ఆయన వారికి హితవులు పలికారు. టి. బిల్లు వ్యతిరేకించే విషయంలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులతోపాటు రాష్ట్ర మంత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు