సమైక్యమే శ్వాస... వాడవాడల్లోనూ జనగర్జన

18 Sep, 2013 02:40 IST|Sakshi
సమైక్యమే శ్వాస... వాడవాడల్లోనూ జనగర్జన

సమైక్య గర్జనలతో సీమాంధ్రలో ఊరూ, వాడా దద్దరిల్లుతోంది. గుంటూరు నగరంలో మంగళవారం ‘మండే గుండెలఘోష’ పేరుతో నిర్వహించిన సమైక్యాంధ్రప్రదేశ్ మహాసభ సమైక్యవాణిని ఎలుగెత్తి చాటింది. విద్యాసంస్థల యాజమాన్య జేఏసీ ఆధ్వర్యంలో నగర నడిబొడ్డునున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నిర్వహించిన సభకు జిల్లానలుమూలల నుంచి  విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు వేలాదిగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయక నడిరోడ్డుపై మూడు గంటలపాటు కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. 49 రోజులుగా అలుపెరగని సమైక్య ఉద్యమం.. మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావురత్తయ్య, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు, కన్వీనర్ ఆచార్య ఎన్. శామ్యూల్, విద్యాసంస్థల జేఏసీ అధ్యక్షుడు జి. వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

 

ప్రకాశం జిల్లా  ఒంగోలు నగరంలో డీఆర్‌డీఏ-ఐకేపీ, మెప్మాల ఆధ్వర్యంలో  నిర్వహించిన ‘ప్రకాశం మహిళా గర్జన’ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు హాజరై సమైక్య నినాదాలు హోరెత్తించారు. కందుకూరులో ఐదు వేల మంది విద్యార్థులు విద్యార్థి గర్జన నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని  కోసిగి మండలకేంద్రంలో దాదాపు 20వేల మంది ప్రజలు సింహగర్జన పేరిట కదంతొక్కారు. సమైక్య నినాదాలు మార్మోగాయి. కర్నూలుకు చెందిన కళాకారులు ఆలపించిన జానపద గీతాలు ప్రజల్లో చైతన్యం నింపాయి.  విశాఖ జిల్లా పెందుర్తిలో మువ్వన్నెల జెండా సాక్షిగా సమైక్యనాదం మిన్నంటింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్‌టీఎస్ రహదారిపై 2300 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన చేపట్టారు.    
- సాక్షి నెట్‌వర్క్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా