సీమాంధ్ర ప్రజలదీ ఒకటే శ్వాస.. ఒకటే ఘోష!!

4 Sep, 2013 02:57 IST|Sakshi
సీమాంధ్ర ప్రజలదీ ఒకటే శ్వాస.. ఒకటే ఘోష!!
‘హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం..’ కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి ఈ ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటిదాకా సీమాంధ్రలో సమైక్య నినాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వాడవాడలా జనం రోడ్డెక్కుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప తమకు మరే ప్రత్యామ్నాయం వద్దంటూ నినదిస్తున్నారు. ఊళ్లుఊళ్లన్నీ ఏకమై గత 35 రోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఉధృతం అవుతోంది. ఉద్యమం సాగుతున్న తీరుతెన్నులు, తీవ్రతపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రాజకీయ అండ లేకుండా నెలరోజులకు పైగా ఉధృతంగా ఉద్యమం సాగడంపై అధ్యయనం చేసింది.
 
ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు.. ఇలా అన్ని వర్గాలు ఎవరికి వారు సంఘాలుగా ఏర్పడి స్వచ్ఛందంగా ఉద్యమంలో పాలుపంచుకుంటున్నట్లు ఇందులో తేలింది. 13 జిల్లాల్లో అనేక వర్గాలు ఎక్కడికక్కడ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ)లు ఏర్పాటు చేసుకున్నాయి. రాష్ట్రం విడిపోతే వచ్చే సమస్యలపై మేధావులు, ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ రంగాల్లో నిపుణులు ప్రజలకు వివరిస్తున్నారు. విద్య, ఉపాధి, విద్యుత్, సాగునీటి రంగాల్లో తలెత్తే సమస్యలను విడమరచి చెబుతున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఎవరికి వారు తలా కొంత చందాలు వేసుకొని ఉద్యమాన్ని సొంతంగా నడిపిస్తున్నారు. ఉద్యోగులు తమ జీతాల్లో నుంచి దాచుకున్న సొమ్మును కొంత ఉద్యమానికి వెచ్చిస్తున్నారు.
 
 కొన్నిచోట్ల రిక్షా, ఆటో, చిరు వ్యాపారులు సైతం ఒకరోజు సంపాదనను విరాళంగా ఇచ్చారు. కూలీలు సైతం చందాలు వేసుకొని సమ్మె చేస్తున్నారు. మరికొన్నిచోట్ల వాటర్ ట్యాంకర్స్, ట్రాక్టర్స్, లారీ, టాక్సీ అసోసియేషన్లు ఒకరోజు అద్దెను ఉద్యమానికి అందించారు. ఈ విరాళాలన్నీ షామియానాలు, కుర్చీలు, ఫ్లెక్సీలు, తెలుగుతల్లి విగ్రహాలకు అభిషేకం చే సేందుకు పాలు, పూలదండల కోసం వెచ్చిస్తున్నారు. బైక్ ర్యాలీల సమయంలో ఎవరికి వారే సొంతంగా పెట్రోలు పోయించుకొని ఉద్యమంలో పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ వైద్యురాలు సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఇప్పటిదాకా సొంతంగా రూ.5 లక్షల దాకా ఖర్చు చేశారు. షామియానాలు, కుర్చీలు, మైక్‌సెట్‌ల కోసం ఈమె రోజుకు రూ.5 వేల దాకా అద్దె చెల్లించారు. అద్దె చెల్లించడం కంటే  వీటన్నింటినీ ఒకేసారి మొత్తంగా కొనుగోలు చేయడం మేలని రూ.లక్ష వెచ్చించి కొన్నారు. ఇక రహదారులపై చేపడుతున్న వంటావార్పు కార్యక్రమాల్లో కుటుంబాలు వంతులవారీగా అన్నదానాలు చేస్తున్నాయి. పాత్రలు ఒకరు, వంటచెరకు ఒకరు, బియ్యం, ఉప్పు, పప్పులు ఒకరు.. ఇలా ఎవరి శక్తి మేర వారు అందిస్తున్నారు. కిరాణా షాపులవారు సైతం అవసరమైన సామగ్రిని ఉచితంగా ఇస్తున్నారు.
 
 ఎక్కడికక్కడ సంఘాలుగా ఏర్పడి..
 సమైక్య ఉద్యమంలో భాగంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా జనం  స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సొంత పనులు సైతం పక్కన పెట్టి ఉద్యమంలో తమంత తాముగా భాగస్వాములు అవుతున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు, నేతల పిలుపు మేరకు ప్రజలు తరలిరావడం చూస్తుంటాం. కానీ సమైక్య ఉద్యమంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రజలే ముందుండి నడుస్తుండగా.. రాజకీయ నేతలు వారి వెనకాల ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమైక్య ఉద్యమంలో పాల్గొనని వర్గమంటూ లేదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు సంయుక్త కార్యాచరణ కమిటీలుగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే.. మైనారిటీలు, కుల వృత్తులవారు, ఉపాధి హామీ పథకం కూలీలు, కోనసీమలో కొబ్బరి ఒలుపు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, కుమ్మర్లు, కమ్మర్లు, కళాకారులు.. ఇలా ఎవరికి వారు సంఘాలుగా ఏర్పడి ఉద్యమానికి కదం తొక్కుతున్నారు. ప్రతీ సంఘం చందాలు వేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇలా 54 జేఏసీలు ఏర్పడ్డాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇలాగే సంఘాలు ఏర్పడ్డాయి. వైద్యులు, న్యాయవాదులు, వాకర్లు, విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, చివరికి గృహిణులు కూడా రోడ్లపైకి వచ్చిన సమైక్య గొంతును వినిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జూలై 31 నుంచి న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచితంగా న్యాయసాయం అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఇలా 59 కేసులు ఉచితంగా వాదించి బెయిల్ మంజూరు చేయించారు. ప్రకాశం జిల్లాలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు తామే నిధులు సమకూర్చుకొని ఉద్యమం నిర్వహిస్తున్నారు. వారికి జిల్లా అధికారులు కూడా సహకరిస్తున్నారు.
 
 విద్యార్థులు, ఉద్యోగుల కీలక పాత్ర..
 సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న భావన విద్యార్థుల్లో బలంగా నెలకొంది. దీంతో వారు ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. సెంట్రల్ వర్సిటీ, తెలుగు వర్సిటీ, ఐఐటీ, మూడు డీమ్డ్ యూనివర్సిటీలు, ట్రిపుల్‌ఐటీలతోపాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, నల్సార్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, నిఫ్ట్ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, 350 ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. డిగ్రీ కాగానే ప్రతి విద్యార్థి హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి నెలకొంది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉపాధి కోసం రాజధాని వైపే అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఈ ఉపాధి అవకాశాలు కనుమరుగైపోతాయన్న ఆందోళన విద్యార్థులను ఉద్యమం వైపు మళ్లిస్తోంది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ కంపెనీల్లో క్యాంపస్ సెలక్షన్లు, ఇంటర్వ్యూల ద్వారా సీమాంధ్ర విద్యార్థులు ఏటా పెద్దసంఖ్యలో ప్రవేశం పొందుతున్నారు. హైదరాబాద్ చేజారితే తమ విద్యార్థులకు ఈ మార్గాలన్నీ మూసుకుపోతాయని ఇంజనీరింగ్ కాలేజీలు భావిస్తున్నాయి. ఈ కాలేజీలన్నింటికీ పాఠశాలలు కూడా ఉండడంతో విద్యార్థులను కూడా ఆందోళనల్లో భాగస్వాములు చేస్తున్నాయి. ఉద్యోగ  వర్గాన్ని కూడా అనేక సమస్యలను తొలగిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయంలో 50 శాతానికి పైగా హైదరాబాద్ నుంచే వస్తుండగా, 13 జిల్లాల సీమాంధ్రలో ఇది 23 శాతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ఆదాయంతో ఉద్యోగులకు జీతాలు కూడా వచ్చే అవకాశం ఉండదన్నది వారి భావన. లక్షల సంఖ్యలో ఉన్న పెన్షనర్లూ ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.
 
 అందరి మాట ‘హైదరాబాదే’..
 రాజధాని హైదరాబాద్‌తో సీమాంధ్రులు దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్నారు. చాలామంది తమవారు హైదరాబాద్‌లో ఉన్నారని, రాష్ట్రం విడిపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే సగం కుటుంబాలకు హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. మిగతా జిల్లాల నుంచి రాజధానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ స్థిరపడినవారు లక్షల్లో ఉన్నారు. ‘‘మా కుటుంబంలో ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుమార్తె బీటెక్ చేసిన తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోదరుడు రామారావు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. విభజన జరిగితే వారిద్దరికీ ఇబ్బందులు తప్పవు. 
 
 అందుకే ఉద్యమంలో పాల్గొంటున్నా’’ అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పంచిరెడ్డి ఆదినారాయణ చెప్పారు. ‘‘మనది అనుకున్న హైదరాబాద్ దూరమవుతుందన్న భావనే ప్రజలను ఉద్యమం వైపు మళ్లిస్తోంది. దీంతోపాటు నీటి పంపకాల్లో గొడవలు, ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న కారణాలతోనే ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది’’ అని అనంతపురం జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవరాజు వ్యాఖ్యానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బంది కూడా విభజనపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘‘అధిక లాభాలు వచ్చే డిపోలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. ఆర్టీసీకి ఉన్న రూ.20 వేల కోట్ల ఆస్తుల్లో రూ.15 వేల కోట్ల ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి. విభజనతో సీమాంధ్ర కార్మికులకు జీతాలొచ్చే పరిస్థితి ఉండదు’’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్టీసీ జేఏసీ నాయకులు పెంచలరెడ్డి పేర్కొన్నారు.
 
 రైతుల్లో ‘సాగునీరు’ ఆందోళన..
 రాష్ట్రాన్ని విడదీస్తే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాయే సరిగ్గా రావడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకలు నీటిని కిందకు వదలక ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫలితంగా నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహం తగ్గుతుండడంతో కృష్ణా ఆయకట్టుకు తీరని నష్టం వాటిల్లుతోంది. గోదావరిపై పోలవరం నిర్మించినా దానికి నీరు ఎలా వస్తుందన్న అంశంపై స్పష్టత లేదు. ఈ ప్రాజెక్టు పూర్తికాకుంటే గోదావరి మిగులు జలాలు కృష్ణాలోకి మళ్లించడం సాధ్యం కాదు. ఇదే జరిగితే అనేక ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యాములు వట్టిపోతాయని, తమ పంటలకు నీరు అందదని రైతులు పేర్కొంటున్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే గత ఏడాది సాగర్ నుంచి కృష్ణా ఆయకట్టుకు నీరు రాని పరిస్థితి ఉంది. ఈ ఏడాది కూడా జూలైలో నీరు విడుదల చేసినా సాగర్‌కు వరదలు వస్తేగానీ ఆయకట్టుకు నీరివ్వలేదు. ఇక రాష్ట్రం విడిపోతే డెల్టా పరిధిలో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఉండదన్న భయం రైతులను వెంటాడుతోంది. ఫలితంగా అన్నదాతలు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ రోడ్డెక్కుతున్నారు.
 
 ఊరుఊరంతా ‘గర్జన’
 సమైక్య పోరులో భాగంగా నిర్వహిస్తున్న ‘గర్జన’లకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది. ఎక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినా ఊరుఊరంతా కదలి వెళ్లోంది. ఇప్పటిదాకా నిర్వహించిన గర్జనలు ఇవీ..
 అనంతపురం జిల్లాలో..
 హా ఆగస్టు 29న కదిరిలో ‘ఖాద్రీ లక్ష జన గర్జన’, సెప్టెంబర్ 2న ధర్మవరంలో ‘లక్ష గళ ఘోష’, సెప్టెంబర్ 3న అనంతపురంలో ‘అనంత జన గర్జన’
 వైఎస్‌ఆర్ జిల్లాలో..
 హా ఆగస్టు 31న కడపలో ‘ద్విలక్ష గళార్చన’
 గుంటూరు జిల్లాలో..
 హా ఈనెల 3న నరసరావుపేటలో ‘లక్షగళ ఘోష’
 కర్నూలు జిల్లాలో..
 హా ఆగస్టు 22న కర్నూలులో, ఆగస్టు 27న నంద్యాలలో, ఆగస్టు 31న ఎమ్మిగనూరులో, ఈనెల 3న ఆదోనిలో ‘లక్షగళ ఘోష’
 ప్రకాశం జిల్లాలో..
 హా ఒంగోలులో సెప్టెంబర్ 2న ‘ప్రకాశం ప్రజాగర్జన’
 కృష్ణా జిల్లాలో..
 హా ఆగస్టు 29న విజయవాడలో, ఆగస్టు 31 ఉయ్యూరులో ‘లక్షగళ ఘోష’
 చిత్తూరు జిల్లా..
 హా ఆగస్టు 26న మదనపల్లెలో ‘లక్ష గళార్చన’
 పశ్చిమగోదావరి జిల్లా..
 హా ఆగస్టు 24న భీమవరంలో ‘లక్ష గర్జన’
 హా ఆగస్టు 25న ఏలూరులో 1,500 మంది విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని తెల్లకాగితాలపై 5 లక్షల సార్లు రాసి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
 హా ఈనెల 3న భీమవరంలో ‘కోటి గర్జన’
>
మరిన్ని వార్తలు