సమైక్యాంధ్రలో 'సమైక్య' సెగలు

1 Aug, 2013 12:01 IST|Sakshi
సీమాంధ్రలో 'సమైక్య' సెగలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు యూపీఏ సర్కార్ సై అనడంతో సమైక్యాంధ ఉద్యమం సీమాంధ్రలో ఉవ్వెత్తున్న ఎగసిపడుతోంది. దీంతో సమైక్యాంధ్రవాదుల నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. రాయలసీమలోని అనంతపురంలో జిల్లా వ్యాప్తంగా నేడు, రేపు బంద్కు సమైక్యాంధ్ర జేఏసీ, విద్యార్థి జేఏసీ బంద్కు పిలుపు నిచ్చాయి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థత పరిపాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పరిస్థితులు ఏర్పాడ్డాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆరోపించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన చేసిన అవినీతి భాగోతాలు బయటకురాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరించారని పేర్కొన్నారు. అనంతపురం పట్టణంలో ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని బస్సులన్నీ డిపోలకే పరిమితమైనాయి.

 

అలాగే చిత్తూరు జిల్లాలోని కూడా నిరసనలు తీవ్రమైనాయి. స్థానిక ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేశారు. తిరుపతిలోని స్థానిక ఎంపీ చింతా మోహన్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇంటిని ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో నిరసనల హోరు జోరుగా ఉంది. రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఆచూకీ తెలయడం లేదంటూ స్థానికులు కొంతమంది రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సరికొత్త వింత నిరసనకు తెర తీశారు.  

కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్లో జాతీయ రహదారిని సమైక్యవాదులు దిగ్భంధనం చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అనపర్తి ఎమ్మెల్యే ఎన్. శేషారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆదే జిల్లాలోని ఆలమూరులో మడికి సమీపంలోని జాతీయ రహదారిపై సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని రెండవ రోజు కూడా బంద్ కొనసాగుతోంది.

జిల్లా కేంద్రమైన ఏలూరులో బావిశెట్టివారిపేటలోని రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆ దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. గుంటూరు జిల్లాలో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని ఆందోళనకారులు దిగ్భంధనం చేయనున్నారు అనే సమాచారం అందటంతో  పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అలాగే సమైక్యవాదులు జిల్లాలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాల్లో బస్సులను నిలిపివేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో కూడా ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు రెండవ రోజుకు చేరుకున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే సీమాంధ్రలోని వివిధ సంఘాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వార్తలు