సోనియాగాంధీ మనసు మారాలి

14 Sep, 2013 03:54 IST|Sakshi

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు సిద్ధమైన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ మనసు మార్చాలని రెవెన్యూ ఉద్యోగులు వల్లూరమ్మను వేడుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా రెవెన్యూ కాన్ ఫెడరేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలు నుంచి టంగుటూరు మండలం వల్లూరులోని వల్లూరమ్మ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద డీఆర్‌డీఏ పీడీ పద్మజ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలోని అన్నిశాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారని, తాజాగా విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి రావడంతో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
 
 సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా సీమాంధ్రలోని ఉద్యోగులంతా 45 రోజులుగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 13 జిల్లాల్లో సమ్మె చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు మూడమంచు వెంకటేశ్వర్లు, టీ శ్రీనివాసులు, ఎం.సుధాకర్, ఏవీ రవిశంకర్, ఆర్.వాసుదేవరావు, శెట్టి గోపి, తోటకూర ప్రభాకర్, కొండపి వెంకటేశ్వరరావు, ఊతకోలు శ్రీనివాసులు, బండారు రవి, ఆర్‌వీఎస్ కృష్ణమోహన్, కే వెంకటేశ్వరరావు, టీ ఏడుకొండలు, కేవీ సత్యనారాయణ, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు కందిమళ్ల వీరాంజనేయులు, పీ రాము, వైపీ రంగయ్య, సురేష్‌బాబు, గ్రామ సేవకుల సంఘ నాయకుడు దార్ల బాలరంగయ్య, పలు మండలాల తహసీల్దార్లు         పాల్గొన్నారు.
 
 వల్లూరమ్మకు అర్జీ అందజేత...
 వల్లూరు (టంగుటూరు), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిలిపివేసి తెలుగు బిడ్డలను కాపాడాలని కోరుతూ రెవెన్యూ కాన్ ఫెడరేషన్ జిల్లాశాఖ నాయకులు వల్లూరులోని వల్లూరమ్మ ఆలయంలో అమ్మవారికి అర్జీ అందజేశారు. ఒంగోలు నుంచి ప్రారంభించిన పాదయాత్ర వల్లూరమ్మ ఆలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా నాయకులంతా కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు