ఆగిన ప్రగతి ‘రథ చక్రాలు’

16 Aug, 2013 02:26 IST|Sakshi
ఆగిన ప్రగతి ‘రథ చక్రాలు’

* సీమాంధ్రలో మూడోరోజూ సమ్మె సంపూర్ణం
* డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
* స్వాతంత్య్ర వేడుకలకు ఉద్యోగుల హాజరు
 
సాక్షి, హైదరాబాద్:  సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో గురువారం మూడోరోజూ సమ్మె సంపూర్ణంగా జరిగింది. 12 జిల్లాల్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని బస్సులు డిపోల నుంచి వెళ్లాయి. సమ్మె నుంచి తిరుమల డిపోను మినహాయించడంతో తిరుపతి, తిరుమల మధ్య గురువారం 75 బస్సులు తిరిగాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులూ పూర్తిగా నిలిచిపోయాయి.

పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఆపరేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని అన్ని జిల్లాల్లోని సమైక్య ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉద్యోగుల సమ్మె ప్రభావం పెద్దగా లేదు. వేడుకల్లో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.
 
నేడు గుంటూరులో ఉద్యోగ సంఘాల సమావేశం
సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు శుక్రవారం గుంటూరులో సమావేశం కానున్నాయి. ఈ భేటీలో సమ్మె సాగుతున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఆంటోనీ కమిటీ ముందు హాజరుకావాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందంలో ఎవరు ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే విషయంలోనూ చర్చ జరగనుంది.
 
సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆవిర్భావం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో గురువారం ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ఆవిర్భవించింది. వేదిక కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. సీమాంధ్రలోని అన్ని వర్గాలను వేదికలో భాగస్వాములుగా చేయాలని గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ సభలో నిర్ణయించారు.

సభ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటు గురించి ఆవిర్భావ సభలో చర్చించామని వెల్లడించారు. నగరంలో ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, మరో సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.
 
విద్యుత్ జేఏసీ సమరశంఖం
విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ సమర శంఖం పూరించింది. శుక్రవారం నుంచీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీడీసీఎల్ సీఎండీకి లేఖను అందజేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈపీడీసీఎల్ పరిధిలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నేతలు తీర్మానించారు.

19, 20, 21 తేదీల్లో బైక్ ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో  రాస్తారోకోలు, 25న వంటావార్పు, 26, 27, 28 తేదీల్లో మౌన ప్రదర్శన.. 29, 30, 31 తేదీల్లో మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్  4 తేదీ వరకు ఆందోళనలు నిర్వహించి, అప్పటికీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటే మెరుపు సమ్మెకు వెళతామని జేఏసీ చైర్మన్ వీఎస్‌ఆర్‌కె గణపతి లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు