విడిపోతే సీమాంధ్ర ఎడారే !

25 Jan, 2014 02:24 IST|Sakshi
విడిపోతే సీమాంధ్ర ఎడారే !

వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన  
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో తాగునీటికీ తంటాలు పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత తదితరులు మాట్లాడారు. విడిపోవడం వల్ల మూడు ప్రాంతాల ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సభలో సమైక్య ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రాష్ట్రం విడిపోతే కొనసాగించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.

 ఓటింగ్ నిర్వహించాలి: సుచరిత
 రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న తెలంగాణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. విభజన సరికాదంటూ శ్రీకృష్ణ కమిటీ తుది అభిప్రాయంతో 461 పేజీల నివేదికను వెల్లడించింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రతోపాటు తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే. సభలో వెంటనే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలి.
 
 ‘రెండు కళ్ల’ పార్టీలవల్లే ఈ ముప్పు: రామకృష్ణారెడ్డి
 కొన్ని పార్టీల వైఖరి స్పష్టంగా లేనందునే విభజన బిల్లు ఇక్కడిదాకా వచ్చింది. వారు అసలు విషయాలు చెప్పకుండా మోసం చేస్తున్నారు. రెండు కళ్లు అంటూ కొన్ని పార్టీలకు స్పష్టమైన విధానం లేకపోవడంతో విభజన జరిగే ప్రమాదం నెలకొంది. నాగార్జునసాగర్ నుంచి ఇప్పటికే కుడిప్రాంతానికి నీరు సరిగ్గా రావట్లేదు. విభజన తర్వాత ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లిపోమంటే.. సీమాంధ్రుల భవిష్యత్తు ఏంకావాలి?
 
 అసమర్థుల పాలనతోనే ఉద్యమాలు: బాలరాజు
 రాజశేఖర్‌రెడ్డి వంటి దమ్మున్న నాయకుడు లేకపోవడం... అసమర్థ నాయకుల పాలనతో ఉద్యమాలు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణ బిల్లు సభకు రావడం విచారకరం.. బాధాకరం.. దురదృష్టకరం. వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చిఉండేదికాదు. ఆయన పాలన స్వర్ణయుగం. అన్ని ప్రాంతాల్నీ సమంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఆయన సమయంలో ఏ వాదం, ఉద్యమం లేదు. మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకం. సమైక్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి ప్రస్తుత బిల్లు వ్యతిరేకం. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలి. విభజనతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గిరిజనులు ఐదవ షెడ్యూల్ కింద గవర్నర్ రక్షణలో ఉంటారు. ఈ ప్రాంతాల్లోనుంచి దేనిని విడదీయాలన్నా.. గ్రామసభల ఆమోదం తప్పనిసరి. కానీ అలాంటివేవీ లేకుండానే విభజిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం లేదు. ప్రజల హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. వ్యతిరేకిస్తూ మేమిచ్చే లేఖల్ని రాష్ట్రపతికి పంపించండి.
 
 ఓటింగ్ కోసం వైఎస్‌ఆర్‌సీపీ పట్టు
 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఈ మేరకు నినాదాలు చేశారు. రోజూ చర్చ కొనసాగుతూనే ఉందని, ఇప్పటికైనా వెంటనే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీలకు చెందిన సభ్యులు.. అబ్రహాం (అలంపూర్), సత్యవతి (ఆముదాలవలస), శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), రామకోటయ్య (నూజివీడు), పద్మజ్యోతి (తిరువూరు), ముత్యాలపాప (నర్సీపట్నం), లింగయ్య (నకిరేకల్), శ్రీధర్ (వర్ధన్నపేట), రాములు (అచ్చంపేట), కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), వెంకట్రామయ్య (గాజువాక) చర్చలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు