అమ్మకు పెట్టు‘బడి’

29 Dec, 2019 08:17 IST|Sakshi

అమ్మ ఒడి  తొలి జాబితా విడుదల

1 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన 

ఎంఈవో కార్యాలయాల్లో గ్రీవెన్స్‌ఏర్పాటు 

సవరణ, చేర్పులకు అవకాశం 

జనవరి మొదటి వారంలో తుది జాబితా వెల్లడి 

అటకమీద దాచిన అమ్మ పోపు డబ్బాకు కొత్త కళ రానుంది. చిన్నారి దాచుకుంటున్న ముంత గలగలమని సవ్వడి చేయనుంది. బుడ్డోడికి ప్యాంట్‌ చొక్కా కొనిచ్చే ఆర్థిక భరోసా తల్లులకు కలగనుంది. చెప్పిన దానికంటే ముందుగా.. మరింత మిన్నగా అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దింది. పారదర్శకంగా ఎంపికలు నిర్వహించిన తొలి జాబితాను ప్రకటించింది. సంక్రాంతిలో తుది జాబితా రూపొందించి తల్లుల ఖాతాలో అక్షరాలా రూ.15 వేలు జమ చేయనుంది. ఇది పేదరికపు కార్ఖానాలో మగ్గుతున్న పేద బిడ్డలను బడి బాట పట్టించి.. ప్రతి ఇంటా విద్యాదీపాన్ని వెలిగించనుంది.

గుంటూరు ఎడ్యుకేషన్‌: పిల్లలను పాఠశాలలకు పంపుతున్న తల్లులకు మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ‘జగనన్న అమ్మ ఒడి’ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ నెలాఖరుకల్లా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జనవరి మొదటి వారంలో తుది జాబితాను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు ముందే మాతృమూర్తుల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నగదు జమ చేయనుంది. “జగనన్న అమ్మఒడి’ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తొలి విడత జాబితాను పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 57 మండలాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతోపాటు జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల తల్లులతో కూడిన తొలి విడతజాబితాను ఎంఈవో కార్యాలయాలకు ఆన్‌లైన్‌లో పంపారు. ఈ జాబితాను పాఠశాలలు, కళాశాలల వారీగా పరిశీలించిన ఎంఈవోలు వాటిని ప్రింట్‌ తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకుగానూ వలంటీర్లకు అందజేశారు.  

ఒకటో తేదీ వరకూ జాబితాల ప్రదర్శన 
ప్రభుత్వం ప్రాథమికంగా విడుదల చేసిన అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలను జనవరి ఒకటో తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రదర్శించనున్నారు. తల్లిదండ్రులు వీటిని పరిశీలించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్‌ గంగాభవాని శనివారం “్ఙసాక్షి’’తో చెప్పారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం శనివారం మూడు రకాలుగా జాబితాలను ఆన్‌లైన్‌లో ఎంఈవోలకు పంపినట్లు చెప్పారు. వీటిలో మొదటిది విద్యార్థి తల్లి పేరుతో ఎంపిక జాబితా కాగా, రెండోది అనర్హత, మూడోది వలంటీర్ల ద్వారా మరోసారి సర్వే చేసి ధ్రువీకరించాల్సి ఉందని వెల్లడించారు. జాబితాలో పేర్లు లేకున్నా, తప్పులు ఉన్నా ఆందోళన చెందకుండా ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి సరి చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ఎంఈవో కార్యాలయాల్లో ప్రత్యేక గ్రీవెన్స్‌ విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికీ పేర్లు నమోదు కాని, వివరాల్లో తప్పులు ఉన్న లబి్ధదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో 7,85,259 మందితో జాబితాలు 
జిల్లా వ్యాప్తంగా 3,662 ప్రభుత్వ, 1200 ప్రైవేటు పాఠశాలల్లో 6,98,331 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 298 జూనియర్‌ కళాశాలల్లో 1,05,897 మంది చదువుతుండగా.. వీరిలో 86,928 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. మొత్తం 7,85,259 మందితో తొలి జాబితా రూపొందించారు.

మొదటి వారంలో తుది జాబితా  
అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు జమ చేయనున్నారు. తొలి జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన తరువాత తల్లి, తండ్రి, సంరక్షుల ఆధార్‌ సంఖ్యను ఆన్‌లైన్‌లో ర్యాండమ్‌గా పరిశీలించి, డబుల్‌ ఎంట్రీలను తొలిగిస్తారు. ఈ ప్రక్రియ అనంతరం లబి్ధదారుల తుది జాబితాను జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. తుది జాబితాలో పేర్లు ఉన్న తల్లులందరికీ జనవరి 9వ తేదీ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  

మరిన్ని వార్తలు