మేకిన్‌ ఇండియా

11 Apr, 2020 03:59 IST|Sakshi

పీపీఈ కిట్ల తయారీలో స్వయం సమృద్ధి

నెల రోజుల క్రితం దేశంలో అసలు ఉత్పత్తే లేదు

ప్రస్తుతం దేశంలో రోజుకు 12 వేల కిట్ల ఉత్పత్తి

ఏప్రిల్‌ 25 నాటికి రోజుకు 30 వేల కిట్ల సామర్థ్యం

రోజుకు మరో 20 వేల ఉత్పత్తికి డీఆర్‌డీవో సన్నద్ధం 

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న వేళ.. మన దేశం దాని కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. మేకిన్‌ ఇండియా దిశగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే వైద్య సిబ్బందికి అత్యావశ్యకమైన వ్యక్తిగత రక్షణ ఉపకరణాల (పీపీఈ) తయారీలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పీపీఈల కొరత తీవ్రంగా ఉందని మార్చి 3వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించగా.. అప్పటికి మన దేశం ఒక్క పీపీఈ కిట్‌ను కూడా సొంతంగా తయారు చేసే పరిస్థితి లేదు. కానీ.. ప్రస్తుతం దేశంలో రోజుకు 12 వేల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నారు. నెల రోజుల్లోనే మన దేశం సాధించిన ఈ ఘనత వెనుక విశేషాల్లోకి వెళితే..

జీరో నుంచి..
కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బంది ఆ వైరస్‌ బారిన పడకుండా రక్షణ కల్పించడంలో పీపీఈ కిట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కిట్‌లో ఫుల్‌ సూట్, బూట్లు, గాగుల్స్, గ్లౌజులు మొదలైనవి ఉంటాయి. 
► ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి మన దేశం పీపీఈల విషయంలో పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతూ వచ్చింది. ప్రధానంగా చైనా నుంచే అయ్యే దిగుమతులే ఆధారం. 
► డబ్ల్యూహెచ్‌వో ప్రకటన అనంతరం మన దేశం ఈ అంశంపై తక్షణ దృష్టి సారించింది. చైనా నుంచి దిగుమతులను పెంచడంతోపాటు యుద్ధ ప్రాతిపదికన దేశంలో పీపీఈ కిట్ల తయారీకి ఉపక్రమించింది.
► వీటి తయారీ ప్రమాణాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దక్షిణ భారత టెక్స్‌టైల్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సిట్ర) వెంటనే కార్యాచరణ చేపట్టింది. 
► కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 12 కంపెనీలకు పీపీఈ కిట్ల తయారీకి అనుమతివ్వడంతో ఆ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి.
► సిట్ర నుంచి అనుమతి పొందిన మరో 25 కంపెనీలు త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. 
► ఫలితంగా ఏప్రిల్‌ 1 నాటికి రోజుకు 12 వేల పీపీఈ కిట్ల తయారీ చేసే స్థితికి మన దేశం చేరుకుంది.
► ఏప్రిల్‌ 15 నాటికి రోజుకు 20 వేలు, ఏప్రిల్‌ 25 నాటికి రోజుకు 30 వేల కిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం వస్తుంది. ఏప్రిల్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల కిట్లు ఉత్పత్తి అవుతాయి.

మన రాష్ట్రంలోనూ.. 
► తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌లో ఉన్న ‘పాల్స్‌ పల్స్‌’ సంస్థ రోజుకు 500 కిట్లు తయారు చేస్తోంది. రోజుకు 5 వేల కిట్ల సామర్థ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది.
► మరోవైపు పీపీఈ కిట్ల తయారీకి హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) కూడా ముందుకు వచ్చింది. రోజుకు 20 వేల కిట్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు