రిజిస్ట్రేషన్ ప్రైవేటు.. లేఖరులకు చేటు

14 Mar, 2016 02:57 IST|Sakshi

రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణకు యత్నం
ఉపాధి కల్పించకపోగా ఉన్నదానికీ ఎసరు
రోడ్డున పడుతున్న వేలాది లేఖరులు

 
వారంతా సిరా కార్మికులు.. కలం వారి పెట్టుబడి..దస్తావేజు రాతతో వచ్చే పదో పాతికతో బతుకు దెరువు సాగిస్తున్న బడుగు జీవులు. బ్రిటీష్ కాలం నుంచి ఇదే వృత్తిగా జీవనం సాగిస్తూ... స్థిరాసులకు రక్షణ కల్పిస్తూ.. రెవెన్యూవ్యవస్థకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో కీలకంగా వ్యవహరించే అలాంటి వారిపై ప్రస్తుత ప్రభుత్వం వేటు వేయాలని చూస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణకు సమాయత్తమవుతోంది. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని లేఖరులు ఆందోళన చెందుతున్నారు.
 
 తప్పులకు బాధ్యత...
లేఖరి తను రాసిన దస్తావేజుకు పూర్తి బాధ్యత వహిస్తాడు. దస్తావేజును తయారు చేసిన తర్వాత ఇరుపార్టీలకు పూర్తిగా చదివి వినిపించి, ఇరు పార్టీల సంతకాలు వగైరాలు చేయించి సాక్షులతో సంతకాలు చేయించి చివరగా దస్తావేజు తయారు చేసినట్టు కాగితం మీద స్రైబ్ చేస్తాడు. దానివలన భవిష్యత్తులో సదరు రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి ఏవైనా చిక్కు లు, కోర్టు తగాదాలు వస్తే మొదట సాక్ష్యం చెప్పే బాధ్యత లేఖరి దే. ఇలాంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల స్థిరాస్తులకు రక్షణ కరువు అవుతుంది.
 
పుంగనూరుటౌన్:  జిల్లాలో బాలాజీ, చిత్తూరు అనే రెండు రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 25 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా సుమారు 3 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అలాగే కొన్ని వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులును  క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తామని టీడీపీ ఎన్నికల హామీలో పేర్కొంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణకు సమాయత్తమవుతోంది.  కేవలం రిజిస్ట్రార్, ఆయనకు సహాయకుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదే జరిగితే రిజిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడి స్థిరాస్తులకు రక్షణ కరువు అవుతోంది.

లేఖరుల వ్యవస్థ కీలకం
లేఖరి దస్తావేజును త యారు చేసే ముందు ఆస్తికి సంబంధించిన హక్కుదారుడు ఎవ రు?, వారసులు ఎవ రు? అని విచారించి సర్వే నంబరు మొదలుకుని హద్దులు, విస్తీర్ణం, కొలతలు, సరిహద్దు హక్కు లు, దారి హక్కులు, నీటికాలువ హక్కులు, సంసృష్టం హక్కులు అన్నీ పూర్తిగా సవిరంగా దస్తావేజులో పొందుపరిచి రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపుతారు. దీనికితోడు దస్తావేజు లేఖరులు స్థానికులు కావడం తో వారికి స్థానిక భూములపై అవగాహన ఉం టుంది. ప్రైవేటీకరణ జరిగితే వారు నియమిం చే వ్యక్తులు ఈ సమాచారాన్ని సేకరించే అవకాశముండదు. భూవ్యవస్థ నాశనమవుతుంది.
 
 
ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలి
29 ఏళ్లుగా దస్తావేజులేఖరిగా కొనసాగుతున్నాను. బీఏ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి పోరాడి చివరకు ఓపిక నశించి తెలిసిన వారి సూచన మేరకు ఈ వృత్తిలోకి వచ్చాను. దేవుడి దయ వల్ల కుటుంబపోషణకు, బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పుణ్యమా అని మాలాంటి వాళ్లు రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వేలాది మంది జీవితాలకు రక్షణ కల్పించాలి.
 - కె.రామమూర్తి, దస్తావేజు లేఖరుల జోనల్ కమిటీ అధ్యక్షులు. పుంగనూరు.
 
 

మరిన్ని వార్తలు