సీనియర్‌ ఐఏఎస్‌ సంతకం ఫోర్జరీ

10 Feb, 2018 00:54 IST|Sakshi
ఏపీ సీఎం చంద్రబాబుతో చంద్రశేఖర్‌ (ఫైల్‌) 

ఓ ప్రైవేట్‌ కంపెనీ పేరుతో రూ.7.7 కోట్లకు రిలీజ్‌ ఆర్డర్‌ 

బ్యాంకు అధికారి అనుమానంతో ఆగిన నగదు చెల్లింపు 

నిందితుడిని అరెస్టు చేసిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ 

ఏపీ సీఎం సహా ప్రముఖులతో నిందితుడి ‘చెట్టాపట్టాల్‌’ 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఏపీ సీఎం కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌.. ఇలా అనేక మంది ప్రముఖులతో దిగిన ఫొటోలు.. కాస్త మాటకారితనం.. ఫార్మా రంగంలో అనుభవం.. ఇవే పెట్టుబడిగా ఓ ఘరానా మోసగాడు భారీ చీటింగ్‌కు ప్రయత్నించాడు. తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావు పేరిట లెటర్‌ హెడ్‌ సృష్టించి ఆయన సంతకం ఫోర్జరీ చేశాడు. వీటి ఆధారంగా ఓ ప్రైవేట్‌ కంపెనీకి రూ.7.7 కోట్ల చెల్లింపునకు రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. ఆఖరి నిమిషంలో చెల్లింపు ఆగిపోగా.. నిందితుడిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ వీవీ శ్రీనివాసరావు పూర్తి వివరాలు వెల్లడించారు. 

అలా ఏర్పడ్డ పరిచయాలు.. 
తూర్పుగోదావరి జిల్లా నడకుదురుకు చెందిన కనుకుటూరి రామకృష్ణ చంద్రశేఖర్‌ కాకినాడలో బీఫార్మసీ చదివాడు. విద్యార్థి దశ నుంచే తరచు రాజకీయ పార్టీల సభలకు వెళ్లేవాడు. కొన్నాళ్లకు ఆయా పార్టీ సమావేశాల్లో ప్రసంగించే వక్తగా మారడంతో కొందరు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దగ్గరయ్యాడు. ప్రధానంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వెంటే తిరుగుతూ ఆయనకు స్పీచ్‌లు రాసివ్వడం వంటివి చేసేవాడు. ప్రతి సందర్భలోనూ వారితో ఫొటోలు దిగి వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్‌ చేసుకుంటూ తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునేవాడు. తన పలుకుబడితో టెండర్లు ఇప్పించడం, బదిలీలు చేయించడం, పోస్టింగ్స్‌ వేయించడం వంటివి తేలిగ్గా చేయగలనంటూ ప్రచారం చేసుకున్నాడు. గతంలో ఏపీ, టీఎస్‌ ప్రభుత్వాలకు చెందిన కాన్ఫిడెన్షియల్‌ ప్రింటింగ్‌ ఆర్డర్స్‌ ఇప్పిస్తానంటూ కోల్‌కతాకు చెందిన కౌశిక్‌ నుంచి రూ.50 లక్షలు గుంజాడు. బాధితుడు అప్పట్లో నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడంతో కేసు మూతబడింది. 

ఉద్యోగం పొంది.. నకిలీ ఆర్డర్‌ ఇచ్చి.. 
కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్‌కు తార్నాకలోని పల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ కె.సురేష్‌బాబుతో పరిచయమైంది. తనకు ప్రముఖులతో ఉన్న పరిచయాలతో అనేక విధాగుఆ ఉపయోగపడతానంటూ అతడిని నమ్మించాడు. పల్స్‌ ఫార్మా కంపెనీకి అప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి మందుల సరఫరాకు సంబంధించిన ఆర్డర్స్‌ ఉన్నాయి. తన పలుకుబడితో ఆర్డర్స్‌ పెంచడంతో పాటు భారీగా అడ్వాన్సులు వచ్చేలా, బిల్లులు త్వరగా పాస్‌ అయ్యేలా చూస్తానంటూ నమ్మబలికాడు. దీంతో సురేష్‌బాబు తమ కంపెనీలో లైజనింగ్‌ ఆఫీసర్‌/మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చాడు. ప్రభుత్వ విభాగాల నుంచి త్వరగా పనులు పూర్తి చేసుకురావడానికి రూ.12.75 లక్షలు చెల్లించారు. సురేష్‌బాబును పూర్తిగా నమ్మించడానికి చంద్రశేఖర్‌ ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినట్లు రూ.7.77 కోట్లకు మొబిలైజేషన్‌ ఆర్డర్‌ రూపొందించాడు. అలానే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఈఎస్‌ఐ విభాగం నుంచి మరో రూ.9 కోట్లకు ఉత్తర్వులు సృష్టించాడు. తెలంగాణ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు పేరు, ఆయన లెటర్‌ హెడ్‌ తదితరాలు సృష్టించాడు. 

హోదా తప్పుగా ఉండటంతో...
సీనియర్‌ ఐఏఎస్‌ రామకృష్ణారావు సంతకం ఫోర్జరీ చేస్తూ పల్స్‌ ఫార్మా కంపెనీ పేరిట రూ.7.72 కోట్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ రిలీజ్‌ ఆర్డర్‌ రూపొందించాడు. దీన్ని అందుకున్న పల్స్‌ సంస్థ మల్లాపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో డిపాజిట్‌ చేసింది. అక్కడి అధికారులు వెరిఫికేషన్‌ కోసం ఈ లెటర్స్‌ను సచివాలయంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ బ్రాంచ్‌కు పంపారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావు ప్రస్తుత హోదా ప్రిన్సిపల్‌ సెక్రటరీ. అయితే ఈ లెటర్స్‌లో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అని ఉండటంతో బ్యాంకు ఏజీఎంకు అనుమానం వచ్చింది. దీన్ని నివృత్తి చేసుకోవడానికి ఆయన నేరుగా రామకృష్ణారావుతో మాట్లాడటంతో అసలు మోసం బయటపడింది. ప్రభుత్వాధికారుల ఫిర్యాదుతో సైఫాబాద్‌ ఠాణాలో కేసు నమోదైంది. సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం శుక్రవారం చంద్రశేఖర్‌ను పట్టుకుంది. నిందితుడి నుంచి కారు తదితరాలు స్వాధీనం చేసుకుని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించింది.

మరిన్ని వార్తలు