తెలుగుదేశం పార్టీలో భగ్గుమన్న అసమ్మతి 

15 Mar, 2019 09:28 IST|Sakshi
అమౌన ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్‌ నేతలు

సాక్షి, మంత్రాలయం: తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ భగ్గుమంది. ప్రాధాన్యత విషయంలో అలకలు రోడ్డెక్కి కూత పెట్టాయి. తీరు మార్చుకో లేకపోతే మద్దతుకు దూరంగా ఉంటామంటూ నినదించాయి. ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం టీడీపీలో సీనియర్‌ నేతలు అలకబూనారు. కోసిగి మండల కన్వీనర్‌ పెండ్యాల ఆదినారాయణశెట్టి, మాజీ సర్పంచు ముత్తురెడ్డి,  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామకృష్ణ, నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, నర్సారెడ్డి, సొట్టయ్య, సాతనూరు మాజీ సర్పంచు మారెప్ప,  నేతృత్వంలో కార్యకర్తలతో తిరుగుబావుట ఎగరేశారు.

తమకు ప్రాధాన్యత ఇవ్వడంలో టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి కినుక వహిస్తున్నారంటూ రోడ్డెక్కారు. గురువారం కోసిగి మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆదినారాయణశెట్టి ఇంటి నుంచి ఎల్లెల్సీ అతిథి గృహం వరకు మౌన ర్యాలీ నిర్వహించారు. అక్కడ నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలో తిక్కారెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తూ సీనియర్‌ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

ఇతర పార్టీ నుంచి పార్టీలో చేరిన కొత్త నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ పాత క్యాడెర్‌కు అన్యాయం చేస్తున్నారన్నారు.    కొత్తగా పార్టీలో చేరిన  కోసిగి ఆంజనేయస్వామి ట్రస్టుబోర్డు చైర్మన్‌ నాడిగేని అయ్యన్నకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం సరికాదన్నారు.  పార్టీ కార్యాలయం ప్రారంభానికి సైతం తమను పిలవకుండా చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన కొత్త ముఖాలకు లభిస్తున్న ప్రాధాన్యం పార్టీలో  తమకు  లేదని మండిపడ్డారు.

ఇలాగే వ్యవహరిస్తే ఎన్నికల్లో తమ సహాయ సహకారాలు ఉండబోవని తేల్చి చెప్పారు. పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నా తిక్కారెడ్డి మూలంగా సరైన గుర్తింపు లేకపోయిందన్నారు. ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసి ఇళ్లకే పరిమిత మవుతామన్నారు. ఎల్లెల్సీ అతిథి గృహంతో సమావేశమైన విషయాన్ని తెలుసుకున్న తిక్కారెడ్డి అక్కడికి చేరుకున్నారు. పాత నాయకుల గోడు విని చూస్తాం చేస్తామన్నారు. అయితే లెక్కలేని విధంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నన్ను నిందించడం సరికాదన్నారు. ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందని హెచ్చరిక దోరణిలో సూచించారు. తర్వాత నాయకులు రాసుకున్న అసమ్మతి పత్రం ఆయనకు అందజేశారు.
 

మరిన్ని వార్తలు