డిప్యూటీ సీఎం కేఈ అధికారాలకు కత్తెర

2 Mar, 2017 02:20 IST|Sakshi
డిప్యూటీ సీఎం కేఈ అధికారాలకు కత్తెర
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోనే అత్యంత సీనియర్లలో ఒకరైన రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తికి పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి. ఆయన వద్ద ఉన్న అధికారాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లపై నేరుగా చంద్రబాబే పెత్తనం చలాయించనున్నారు. వాళ్ల నియామకాలు, బదిలీల అధికారాన్ని రెవెన్యూ మంత్రి నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) అప్పగించారు. ఈ మేరకు జీవో నెం. 28ను జారీ చేశారు. 
 
గతంలో కూడా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. కేఈ కృష్ణమూర్తి చేసిన బదిలీలను ఆయన నిలిపివేయించారు. ఇప్పుడు జీవో 28ను జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన సీనియర్ మంత్రిని ఇంతలా అవమానిస్తారా అని ఆయన అనుయాయులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేఈ కృష్ణమూర్తికి అవమానాలే ఎదురవుతున్నాయి. రాజధాని వ్యవహారంలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టి, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణకు పెత్తనం ఇచ్చారు. అలాగే భూ కేటాయింపుల సంఘంలో కూడా కేఈ కృష్ణమూర్తికి చోటు దక్కలేదు. ఇప్పుడు ఏకంగా తన సొంత శాఖకు చెందిన నియామకాలు, బదిలీల విషయాన్ని కూడా ఆయన చూడలేకుండా చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.