సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా..!

21 Mar, 2019 10:34 IST|Sakshi

గ్రామాల్లో నాన్‌లోకల్‌ మంత్రాంగం

మొదలైన ఎన్నికల హడావుడి

ఎన్నికల్లో చూపనున్న ప్రభావం

సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎన్నికల కోడ్‌ వచ్చింది. గ్రామాల్లో ఎండలు పెరగడంతోపాటు రాజకీయ వేడి పెరిగింది. ఏ టీ దుకాణం వద్ద చూసినా, రచ్చబండ వద్ద అయినా ఎన్నికలకు సంబంధించిన చర్చే. కాగా రెండు రోజుల నుంచి గెలుపు, ఓటములు పార్టీ అభ్యర్థులపై ప్రజల మధ్య చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో లోకల్‌, నాన్‌లోకల్‌ సెంటిమెంట్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రామాల్లో చర్చలు చెబుతున్నాయి. కందుకూరు నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధరరెడ్డి స్వగ్రామం నియోజకవర్గ పరిధిలోని మాచవరం గ్రామం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతుల రామారావు స్వగ్రామం కొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు గ్రామం. వీరి స్వగ్రామాలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీశాయి. ఇటీవల వైఎస్సార్‌ సీపీలోకి భారీగా వలసలు చోటుచేసుకున్నాయి. పొరగు పెత్తనం ఇక్కడ ఎక్కువ అయిందనే భావన ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. దీంతో వలసలు అధికమయ్యాయి.

కందుకూరు... టంగుటూరు అయిందనే భావనా ?
పేరుకు కందుకూరు నియోజకవర్గం అయినా గత మూడేళ్లుగా ఈ ప్రాంత నాయకులు అందరూ టంగుటూరుకు వెళ్లి పనులు చేయించుకునేవారు. సమావేశాలు, పింఛన్లు, లోన్ల ఎంపిక కూడా అక్కడ నుంచి జరిగింది. ఈ ప్రభావం ఇప్పుడు ఎన్నికల్లో భారీగా పడుతుందని అందుకే గ్రామాల్లో లోకల్, నాన్‌లోకల్‌ చర్చ ఎక్కువ నడుస్తోంది. ఇక్కడ స్థానికుడు, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ఉన్నా కూడా కేవలం ఆర్థికంగా బలం ఉందని పోతుల రామారావుకు టికెట్‌ కేటాయించారని టీడీపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది. నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో కూడా శివరాం అయితే లోకల్‌ కదా ఇక్కడే ఉంటాడు అనే భావన ఉంది. ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. బయట వ్యక్తుల పెత్తనం ఇక్కడ ఎందుకు అనే ఆలోచన పాత టీడీపీ కార్యకర్తల్లో ఉంది.

కీలకం కానున్న సెంటిమెంట్‌..
ఈ ఎన్నికల్లో సెంటిమెంట్‌ తీవ్రంగా పనిచేసే అవకాశం ఉందని స్థానికుల అభిప్రాయం. మహీధర్‌రెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. పోతుల రామారావు నియోజకవర్గంలో కాకుండా టంగుటూరులో ఉంటారు. ఆయనని కలవాలంటే నాయకులు అక్కడికి వెళ్లి కలవాలి. ఎన్నికలు నెలలోపే ఉండడంతో ఈ చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు