అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు

24 Apr, 2020 20:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అసత్య ప్రచారాలు చేసే వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అసత్య ప్రచారాలకు సంబంధించిన విషయాలపై డీజీపీతో చర్చించామన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై సైబర్ చట్టాల క్రింద కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరో పార్టీ మీద అభిమానంతో తప్పుడు సమాచారం అందిస్తున్నారని,  తద్వారా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘  తెలుగు దేశం పార్టీ నాయకులు ఇంట్లో కూర్చున్నారు. ఐసొలేషన్‌ మంచిదే.. ఇంట్లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు లేఖలు రాస్తున్నారు. అనేక మంది ఫీల్డ్‌లో పని చేస్తున్నారు. వారిని డీమోరలైజ్ చేయొద్దు. 

జనతా బజార్ల ద్వారా రైతులకు సెల్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచన. ఒక బలమైన మార్కెటింగ్ వ్యవస్థ దీని ద్వారా ఏర్పడుతుంది. రైతు ఒత్తిడికి గురికాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఈనాడు పత్రికలో అవాస్తవాలు, అసత్యాలు రాస్తున్నారు. ప్రభుత్వం పంటలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వ్యవసాయ మార్కెటింగ్‌పై ముఖ్యమంత్రి ఫోకస్ చేస్తున్నారు. రేపటి నుండి రైతులకు నమోదు కూపన్లు అందిస్తున్నాం. ఆ కూపన్ల ఆధారంగా పంట కొనుగోలు చేస్తాం. ఒకవేళ మద్దతు ధర కంటే అధిక ధర వస్తే రైతులు అమ్ముకోవచ్చు. ( ‘మీలా ఇంట్లో పడుకుని ప్రకటనలు ఇవ్వడం లేదు’ )

నిబంధనలు పక్కన పెట్టి తడిచిపోయిన శనగలు సైతం ముఖ్యమంత్రి కొనుగోలు చేయమని ఆదేశించారు. అధికారిక నివేదికల ప్రకారం కేవలం 25 శాతం మాత్రమే మార్కెట్లు పనిచేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా మే 15కు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులకు ఒక గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించార’’ని అన్నారు.

మరిన్ని వార్తలు