ఆటోలు ఢీ.. పది మందికి తీవ్రగాయాలు

28 Feb, 2014 01:47 IST|Sakshi

పండుగ ఆ కుటుంబాల్లో వేదనను మిగిల్చింది... పండక్కి వెళ్లి సంతోషంగా గడపాలని భావించిన వారికి ఆటో రూపంలో ప్రమాదం సంభవించి క్షతగాత్రులుగా మిగలాల్సి వచ్చింది. మూడు కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచక పిల్లలు రోదించారు.
 
నర్సీపట్నం/నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ :  ఎదురెదురుగా వస్తున్న ప్రయాణికులు, గూడ్సు ఆటోలు ఢీకొనడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి 7గంటల సమయంలో పట్టణంలోని కేవీఆర్ ఫంక్షన్ హాలుకు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి నుండి వస్తున్న బొప్పాయి లోడు ఆటో నర్సీపట్నం నుండి 11 మంది ప్రయాణికులతో ఏటిగైరంపేట వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ప్రయాణికుల ఆటోడ్రైవర్‌తో పాటు తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

వీరందరికీ స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి ఐదుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో మాకవరపాలెం మండలం చామంతిపురానికి చెందిన భార్యాభర్తలు పోతల రమణ(50), వరలక్ష్మి(45)తో పాటు పిల్లలిద్దరితో కలిసి గబ్బాడ పోతురాజుబాబు పండుగకు వెళ్తూ ఈ ఆటో ఎక్కారు. ఇదే మండలం పాపయ్యపాలేనికి చెందిన గవిరెడ్డి బాలరాజు(12), గబ్బాడకు చెందిన పెదపూడి జోగులమ్మ(50), కశింకోట మండలం తీడ నుండి కొల్లు రామకృష్ణ(35) గబ్బాడలో జరుగుతున్న పండుగకు వెళ్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు.

ఇదే మండలం పాపయ్యపాలేనికి చెందిన లెక్కల జ్యోత్స్న(9), లెక్కల రత్నం(45), గొలుగొండ మండలం ఏటిగైరంపేటకు చెందిన పోతల సత్య(20), పోతల పొన్నంనాయుడు(14)లు తమ స్వగ్రామానికి వెళ్తూ ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. పాకలపాడు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కూరాకుల రామకృష్ణ(35) గాయపడ్డారు. వీరిలో భార్యాభర్తలైన పోతల రమణ, వరలక్ష్మిలకు తీవ్రగాయాలు కావడంతో ఇద్దరు పిల్లలు వారి పక్కన కూర్చుని బిత్తర చూపులు చూస్తున్నారు.

తల్లీకూతుర్లయిన లెక్కల రత్నం, జ్యోత్స్నల ఇద్దరి కాళ్లు నుజ్జయ్యాయి. అక్కాతమ్ముడైన పోతల సత్య, పొన్నంనాయుడులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పొన్నంనాయుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాత్రి 7గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో క్షతగాత్రులందరినీ ఏరియా ఆస్పత్రికి 108లో తరలించి చికిత్స అందించారు.   క్షతగాత్రుల బంధువులు హుటాహుటిన తరలి వచ్చారు. ప్రమాదానికి కారణమైన గూడ్స్ ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు. నర్సీపట్నం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు