కేసుల తీవ్రత రెడ్‌జోన్లలోనే

27 Apr, 2020 02:44 IST|Sakshi

ఒక్క రోజులో నమోదైన కేసుల్లో  72.83% మూడు జిల్లాల్లోనే

కర్నూలు, గుంటూరు,కృష్ణాలో ఎక్కువ కేసులు

ఆదివారం పరీక్షల్లో 5 జిల్లాల్లో సున్నా కేసులు

90 శాతం కేసులు రెడ్‌జోన్లలోనే

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెడ్‌జోన్లు కేంద్రంగా కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మిగతా జిల్లాల్లోగానీ, కొత్త ప్రాంతాల్లోగానీ వైరస్‌ విస్తరణ లేనందున ఆందోళన అవసరం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇన్‌ఫెక్షన్‌ రేటు అతి తక్కువగా 1.6 శాతం మాత్రమే ఉండటం ఊరట కలిగిస్తోంది. ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి జాతీయ సగటు రేటు 4.23 శాతం ఉంది. కరోనాతో ఛిన్నాభిన్నమైన అమెరికాలో ఇన్‌ఫెక్షన్‌ రేటు భారీగా ఉంది. కేసుల సంఖ్య, మరణాలు భారీగా నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పది లక్షల జనాభాకు సగటున వెయ్యి పరీక్షలకుపైగా నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 

6,768 టెస్ట్‌లు, 81 కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 81 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 59 కేసులు మూడు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో 72.83 శాతం కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే నమోదయ్యాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 కేసులు నమోదయ్యాయి. ఆదివారం 6,768 టెస్టులు చేయగా 81 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఇందులో 59 కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే నమోదయ్యాయి. అవికూడా ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని, ఇప్పటికే వాటిని రెడ్‌జోన్‌లుగా ప్రకటించి కంటైన్‌మెంట్‌ చర్యలు చేపడుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

90 శాతం రెడ్‌జోన్లలోనే..
–కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో మరిన్ని టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
– ఆశాలు, ఏఎన్‌ఎంలు, వలంటీర్ల అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
–ఇన్ఫెక్షన్‌ ఉన్న వారందరినీ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించనున్నారు. 
–ఆదివారం నమోదైన కేసుల్లో 90 శాతం రెడ్‌జోన్లలోనే నమోదయ్యాయి. 
–చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
–పశ్చిమ గోదావరిలో 12 కేసులు నమోదయ్యాయి.
– ఇప్పటివరకు 68వేల పైచిలుకు టెస్టులు నిర్వహించగా కర్నూలు, గుంటూరు, కష్ణా జిల్లాల్లో 18,789 నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.
–మొత్తం కేసుల్లో ఈ మూడు జిల్లాల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు 670 కాగా మిగతా 9 జిల్లాల్లో 427 కేసులు నమోదయ్యాయి.
–రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 4.92 శాతం పాజిటివిటీ రేటు ఉంది
–విజయనగరంలో పాజిటివిటీ రేటు సున్నా కాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా 0.08 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. 
–రికవరీ రేటు మరింత పెంచేందుకు క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌పై దష్టి పెట్టనున్నారు.
–ప్రత్యేక నిపుణుల కమిటీ 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టారు. 

రాష్ట్రంలో మెరుగ్గా పరిస్థితి..
– దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్ఫెక్షన్‌ రేటు చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగా ఉంది. జాతీయ సగటు కంటే ఏపీలో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తాజా గణాంకాలు సైతం నిర్ధారిస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో 6.4 శాతం నుంచి 8.6 శాతం వరకు ఇన్‌ఫెక్షన్‌ రేటు ఉన్నట్లు పరీక్షలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 8.64 శాతం ఉంది. ఏపీలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 1.6 శాతం మాత్రమే ఉంది. అదే జాతీయ సగటు రేటు 4.23 శాతం ఉంది. పరీక్షలు, పాజిటివ్‌ కేసుల ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. 
– అత్యధిక టెస్టుల నిర్వహణలోనూ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. దేశంలో పది లక్షల జనాభాకు సగటున వెయ్యి టెస్టులు దాటిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 

పాజిటివ్‌ కేసుల శాతం రాష్ట్రంలో చాలా తక్కువ
‘ఇన్ఫెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలన్న ఉద్దేశంతో టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం. ఆదివారం నమోదైన కేసులు ఎక్కువగా రెడ్‌జోన్‌లోనే కాబట్టి ఆందోళన అవసరం లేదు. పాజిటివ్‌ కేసుల శాతం రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. వైరస్‌ నియంత్రణకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి’
–డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ 

మరిన్ని వార్తలు