కొండలు.. గుట్టలు దాటుకుంటూ..

3 Jun, 2020 04:23 IST|Sakshi
అడవి గుండా పింఛన్‌ పంపిణీకి వెళ్తున్న వలంటీర్‌ రాంబాబు, రాజన్న గూడలో వృద్ధురాలికి పింఛన్‌ అందిస్తున్న ఆనంద్, చేతికి పిండి కట్టుతోనే పింఛన్‌ అందిస్తున్న లక్ష్మీ వరప్రసాద్‌

పింఛన్లు పంపిణీ

మన్యంలో గ్రామ వలంటీర్ల సేవలు  

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామ వలంటీర్ల వ్యవస్థ విశాఖ మన్యంలో పటిష్టంగా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల గడప వద్దకు చేర వేసేందుకు వలంటీర్లు ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రధానంగా పింఛన్‌ సొమ్ము పంపిణీలో వీరి పాత్ర కీలకం. రహదారులుండవు.. ఉన్నా ఎక్కడ కిందపడతామో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితిలో వలంటీర్లు ఎంతో శ్రమకోర్చి పింఛన్లు పంపిణీ చేస్తుండటం ‘సాక్షి’ పరిశీలనలో కనిపించింది. 

రానుపోను 10 కి.మీ.
పాడేరు రూరల్‌: పాడేరు మండలం దేవాపురం పంచాయతీ పరిధిలోని పందిగుంట మూరు మూల ఉంటుంది.  మండల కేంద్రానికి సుమారు 50 కిలోమీటర్లు.. పంచాయతీ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన పాంగి కొండమ్మ అనే గిరిజన మహిళ వితంతు పింఛన్‌ తీసుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ కేంద్రమైన దేవాపురం గ్రామానికి సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన వచ్చి వెళ్లేది. ప్రస్తుతం కొమ్మ రాంబాబు అనే గ్రామ వలంటీర్‌ పింఛన్‌ సొమ్మును నేరుగా ఆమె ఇంటి వద్దే అందజేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. మార్గం మధ్యలో టైర్‌ పంక్చర్‌ కావడంతో వాహనాన్ని అక్కడే ఉంచి, సుమారు 3 కిలోమీటర్లు నడిచి ఆ గ్రామానికి వెళ్లాడు. ఆమె ఇంటి వద్ద లేదు. పొలానికి వెళ్లిందని తెలుసుకుని.. అక్కడికే వెళ్లి పింఛన్‌ అందజేశాడు. వచ్చే నెల నుండి పింఛన్‌ రూ.2,500 అందుతుందని వలంటీర్‌ రాంబాబు చెప్పడంతో కొండమ్మ సంతోషం వ్యక్తం చేసింది. మా ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ ఇచ్చే రోజు వస్తుందని ఊహించలేదంది. వలంటీర్‌ రాంబాబు తిరుగు ప్రయాణంలో బండిని కొంత దూరం తోసుకుంటూ వచ్చి, పంక్చర్‌ వేయించుకుని ఇంటికి వచ్చే సరికి సాయంత్రం 4 గంటలైంది.  

గిరి శిఖరాలపై ఉన్నా.. 
సీతంపేట : ఆ ఊరు పేరు రాజన్నగూడ. కొండ అంచున ఉన్న గ్రామమది. మధ్యాహ్నం వేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. గిరిజనులంతా కొండపోడు పనులకు వెళ్లిపోయారు. గ్రామంలో వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. అలాంటి సమయంలో ‘అమ్మా.. నీకు పింఛన్‌ వచ్చింది తీసుకో’ అంటూ మంచంపై పడుకున్న బామ్మ సింగమ్మిని లేపారు వలంటీర్‌ సవర ఆనంద్‌. ఇంతకు ముందు పింఛన్‌ తీసుకోవడానికి ఆ బామ్మ కొండ దిగి వెళ్లడానికి నానా అవస్థలు పడేది. ఇప్పుడా కష్టం తప్పింది. వలంటీరు కొండ మీద ఉన్న తన ఇంటికి వచ్చి మరీ పింఛన్‌ ఇస్తున్నాడు. దీంతో ఆమె సంబరపడిపోతున్నారు. మరో గ్రామమైన కానంగూడను సందర్శించగా అక్కడ సవర బాపడు అనే వృద్ధుడు కదలలేని స్థితిలో ఉంటే అక్కడి గ్రామ వలంటీర్‌ రామారావు.. పింఛన్‌ ఇవ్వగానే ఎంతో ఆనందించాడు. కర్రగూడ గ్రామంలో వృద్ధుడు తోటయ్యకు వలంటీర్‌ పింఛన్‌ ఇవ్వగానే నిత్యావసర సరుకులు కొనుక్కుంటానంటూ బయలుదేరాడు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలోని ప్రతి గిరిజన గ్రామంలో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో సుమారు 470 గిరిజన గ్రామాలున్నాయి.  కొండలపై ఉన్న గ్రామాలు సుమారు 350 వరకు ఉంటాయి. ఇక్కడ ఉంటున్న పింఛన్‌దారులందరికీ వలంటీర్లు ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్‌ అందిస్తున్నారు.

పెళ్లి దుస్తుల్లోనే విధులకు..
అమడగూరు: అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని గోపాల్‌నాయక్‌ తండాలో వలంటీర్‌ రాజశేఖర్‌నాయక్‌ పెళ్లి పీటల నుంచి నేరుగా వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టాడు. గోపాల్‌నాయక్‌ తండాకు చెందిన వలంటీర్‌ రాజశేఖర్‌ నాయక్‌కు కదిరి సమీపంలోని తండాకు చెందిన ఇందిరతో ఈనెల 1న వివాహం జరిగింది. అయితే అదే రోజు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండటంతో ఉదయం 6 గంటలకు తాళి కట్టగానే పెళ్లి పీటల పైనుంచి నేరుగా వెళ్లి 50 మంది లబ్ధిదారులకు పింఛన్‌ను అందజేశాడు. 

కొండ పైకే పెన్షన్‌
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం, రంపచోడవరం/కూనవరం:  ఒకవైపు శబరి, మరోపక్క గోదావరి.. మిగిలిన రెండు దిక్కులూ ఎల్తైన కొండలే. మధ్యలో కూనవరం మండలం. రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన నాలుగు మండలాలతో చింతూరు ఐటీడీఏ ఏర్పాటైంది. దీని పరిధిలో ఉన్న 4 మండలాల్లో కూనవరం ఒకటి. ఈ మండలంలో 56 చిన్నా, పెద్దా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల జనాభా 26,800. మండలంలోని కొండలపై 10 ఆదివాసీ పల్లెల్లో 70 మంది (గతంలో 36 మందే) పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో గబ్బిలాల గొంది అనే పల్లెలో పింఛన్ల పంపిణీ ఇలా సాగింది.  

► మంగళవారం ఉదయం 6 గంటలు కావస్తోంది. కూనవరం మండల కేంద్రం నుంచి 20 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వలంటీర్‌ సూట్రు లక్ష్మారెడ్డి టేకులొద్ది చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి సమయం 7 గంటలు అయింది.  
► టేకులొద్ది నుంచి ముందుకు వెళ్లాలంటే దారి కనిపించలేదు. అక్కడి నుంచి కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. కనిపిస్తోన్న చిన్న కాలిబాట పట్టుకుని రెండు కొండలు ఎక్కి.. దిగడానికి మూడు గంటల సమయం పట్టింది. అంటే గబ్బిలాలగొంది గిరిజన ఆవాసం చేరుకునే సరికి ఉదయం 10 గంటలు అయింది.  
► అలా సుమారు 15 కిలోమీటర్లు కాలినడకన కొండలు ఎక్కుతూ దిగుతూ ప్రయాణించాక గబ్బిలాలగొంది గ్రామం వచ్చింది.  
► గ్రామంలో తొమ్మిది మంది పింఛన్‌ దారులున్నారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు. వారందరికీ వలంటీర్‌ పింఛన్‌ పంపిణీ చేశాడు. ఇలా కొండపైకి వచ్చి ఇంటి పట్టునే పింఛన్‌ ఇత్తారని కలలో కూడా అనుకోలేదయ్యా.. అంటూ వారు చాలా సంతోషపడ్డారు. గతంలో అష్టకష్టాలు పడి రెండు కొండలు ఎక్కి దిగి ఎల్లాల్సిందేనయ్యా అని చెప్పారు.

చేతికి పిండికట్టుతోనే.. 
ఒంగోలు టౌన్‌: ఒంగోలు 29వ డివిజన్‌లోని వార్డు వలంటీర్‌ తోట లక్ష్మీవరప్రసాద్‌ పదిరోజుల క్రితం బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఎడమ చేయి విరగడంతో వైద్యులు పిండికట్టు వేసి 40 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. లక్ష్మీ వరప్రసాద్‌ క్లస్టర్‌ పరిధిలో 25 మంది పింఛన్లు పొందుతున్నారు. జూన్‌ 1న వారికి పింఛన్లను ఎలాగైనా అందించాలని అనుకున్న లక్ష్మీవరప్రసాద్‌ తన కుమార్తె వర్షిత సాయంతో 25 మందికీ పింఛన్లు అందించి వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నాడు.

మరిన్ని వార్తలు