ఆశలు ఆవిరి

1 Dec, 2013 03:27 IST|Sakshi

 కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కృష్ణానది జలాల వివాదాలపై ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పు జిల్లా  రైతాంగం పాలిట శరాఘాతంలా మారింది. జలయజ్ఞం ఫలాలపై అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి.
 
 మిగులు జలాలపై ఆధారపడి వేల కోట్ల రూపాయలతో చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకమైంది. కేసీ కెనాల్ ఆయకట్టుపై సైతం నీలి నీడలు ప్రసరిస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో వైఫల్యం ఫలితమే ఈ తీర్పనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
 
 రాయలసీమ ఉద్యమ ఫలితంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 38 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మూడు లక్షల 20 వేల ఎకరాలకు నీరందించాలనేదే లక్ష్యం. వందలాది గ్రామాల దాహార్తిని తీర్చేందుకు కూడా ఈ పథకం ఉద్దేశించబడింది. 1989 చివరిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్‌లో మార్పులు చేయడంతో  పుణ్యకాలం కాస్త గడిచిపోయింది.
 
 ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టును ఏకంగా అటకెక్కించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్టు పునరుజ్జీవం పొందింది. తెలంగాణ నేతల అసంబద్ద ఆరోపణలను లెక్కచేయకుండా ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల వరదను ప్రవహింపజేశారు. దీంతో పనులు శరవేగంగా సాగాయి. ఈ ప్రాజెక్టులో అంతర్బాగమైన గండికోట రిజర్వాయర్ 27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం పూర్తి చేసుకుంది.
 
 మొదటి దశ కింద 35 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1413.42 కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఇప్పటివరకు 1205.32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిత్య కరువు పీడిత ప్రాంతమైన పులివెందుల నియోజకవర్గంలో 47.500 ఎకరాలకు నీరందించే గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 712.31 కోట్ల  రూపాయలు విడుదల కాగా, ఇప్పటికి 660.80 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 20,750 ఎకరాలకు నీరందించే గండికోట-సీబీఆర్ పథకానికి 1461.355 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికి 1174.40 కోట్లు ఖర్చు చేశారు. ఇక గాలేరు-నగరి రెండవ దశ కింద లక్షా 32 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1000.88 కోట్ల రూపాయలు కేటాయించగా, 147.34 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. జిల్లాకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్టు ఉనికి ట్రిబ్యునల్ తీర్పు వల్ల అంధకారంలో పడిపోయింది. ఇటీవలే గండికోట రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను కొద్దిమేర తరలించారు. తమకు పునరావాసం కల్పించనందున ఐదు గ్రామాల ప్రజలు అభ్యంతరాలు తెలుపడంతో నీటి సరఫరా ఆగింది. బహుశా గండికోట రిజర్వాయర్‌కు నీటి తరలింపు ఇదే మొదటి, ఆఖరుదేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
 
 
 40 టీఎంసీల సామర్థ్యంతో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. ఇక వెలిగొండ ప్రాజెక్టు ద్వారా బద్వేలు నియోజకవర్గంలోని కొంత ఆయకట్టుకు నీరందడం దుర్లభంగా మారింది.
 
 
 పురాతన కేసీ కెనాల్ భవితపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. తుంగభద్ర నుంచి నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం వల్ల జిల్లా ఆయకట్టు అవసరాల కోసం  కొన్నేళ్లుగా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి కరా్ణాటకకు అనుమతి ఇచ్చిన నేపధ్యంలో కృష్ణానీరు సరిపడు స్థాయిలో శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకుంటాయన్నది ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితుల్లో కేసీ ఆయకట్టుకు సైతం గడ్డురోజులు దాపురించనున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 

మరిన్ని వార్తలు