ఇక ప్రజాక్షేత్రంలోకి..

28 Aug, 2014 00:14 IST|Sakshi
ఇక ప్రజాక్షేత్రంలోకి..
  • వైఎస్సార్‌సీపీ సంస్థాగత కసరత్తు
  •  కొత్త జట్టు ఏర్పాటు
  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సంస్థాగత కసరత్తు దిశగా వైఎస్సార్‌సీపీ రెండో అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలోకి దూసుకువెళ్లడమే లక్ష్యంగా జిల్లా పార్టీకి కొత్త జట్టును ప్రకటించింది. సంస్థాగత వ్యవహారాల్లో జిల్లా పార్టీకి సహాయసహకారాలు అందించడానికి పరిశీలకులను నియమించింది. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది.  జిల్లాకు చెందిన పలువురు పార్టీ నేతలకు రాష్ట్ర కమిటీలో తగిన ప్రాధాన్యం కల్పించారు. ఈమేరకు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర పార్టీ కార్యాలయం బుధవారం ఓ జాబితాను ప్రకటించింది. ఆ ప్రకారం...

    ముగ్గురు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు:

    జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ముగ్గురు పరిశీలకులను నియమించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడిగా తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు బాధ్యతలు అప్పగించారు. అనకాపల్లికి పరిశీలకుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును నియమించారు. అరకుకు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు.
     
    ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా సుజయ్

     
    పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్‌గా బొబ్బిలి ఎమ్మె ల్యే సుజయ్‌కృష్ణ రంగారావును నియమించారు. ఆయన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు.
     
    రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాబూరావు

    పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యం కల్పించారు. ఆయన్ని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తొలి జాబితాలో 8మందిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో బాబూరావును కూడా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ప్రకటించారు. దాంతో ఆయనకు అధిక గుర్తింపు ఇచ్చినట్టయింది.
     
    ఇతర జిల్లాలకు పరిశీలకులుగా...

    జిల్లాకు చెందిన మరో ఇద్దరు నేతలకు కూడా రాష్ట్ర పార్టీ గుర్తింపునిచ్చింది. మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని తూర్పుగోదావరి జిల్లా పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇక త్వరలో జిల్లా పార్టీ అనుబంధ కమిటీలను కూడా ప్రకటించేందుకు పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది.
     

మరిన్ని వార్తలు