సిద్దిపేటలో హైరిస్క్ ప్రసవ కేంద్రం ఏర్పాటు

20 Jan, 2014 00:39 IST|Sakshi

 సిద్దిపేటటౌన్,న్యూస్‌లైన్: సిద్దిపేట మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఈనెల 24న రాష్ట్రంలోనే తొలి హైరిస్క్ ప్రసవ కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శిశువులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  గతంలో గర్భిణుల బీపీ, షుగర్ లెవల్స్‌లో తేడాలు వచ్చినా, రక్తహీనత ఉన్నా వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించే వారన్నారు.

బడుగు వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువగా సిద్దిపేట ఆస్పత్రికి వస్తున్నందున వారి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైరిస్క్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. వైద్య ఆరోగ్యపరిషత్ ఎండీ అజయ్ సహానితో పాటు పలువురు ప్రముఖులు ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇక నుంచి గర్భిణులకు ఇక్కడ అన్ని రకాల వైద్యసేవలు నిరంతరాయంగా అందుతాయన్నారు. అదేవిధంగా 30 రోజుల లోపు వయసు ఉన్న శిశువుల సంరక్షణ కోసం ఆధునిక పరికరాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13 మంది నర్సులు, గైనకాలజిస్టులు, 24 గంటలు పనిచేయడానికి ముగ్గురు ప్రత్యేక డాక్టర్లను నియమిస్తామన్నారు.

 ఆస్పత్రిలో రూ. 12 లక్షల విలువైన పరికరాలను ఏర్పాటు చేశారన్నారు. సీసీ కెమెరాలు, స్కైప్ ద్వారా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఇక్కడి సేవలను తనిఖీ చేస్తారన్నారు. గర్భిణుల స్కానింగ్ పరీక్షలు నిర్వహించడానికి శిక్షణ పొందిన డాక్టర్ లేనందున ప్రైవేట్ డయాగ్నసిస్ సెంటర్‌లో పేద గర్భిణులకు ఉచిత స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చిన కలెక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 తక్కువ ధరలకే మందులు
 జీవనధార పథకం కింద సిద్దిపేట అర్బన్, రూరల్ సమాఖ్యల ద్వారా రెండు జనరిక్ మందుల దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30 నుంచి 40 శాతం తక్కువ ధరలతో గుర్తించిన కంపెనీల మందులు ఇక్కడ లభిస్తాయన్నారు. తక్కువ ధరల్లో లభించే నాణ్యమైన మందులను ఎవరైనా కొనుగోలు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో వైద్యులు జగన్నాథరెడ్డి, శివరాం, శివానందం, కాశీనాథ్, ధర్మ, సుజాత, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 సూపరింటెండెంట్‌పై ఎమ్మెల్యే ఫైర్
  సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన మందుల చీటీలు  కనిపించాయి. సర్కారు దవాఖాన నుంచి కొందరు డాక్టర్లు ప్రైవేటు దందాలో భాగస్వాములవుతున్నట్లు సాక్ష్యం లభించింది. ఆస్పత్రిలోని వైద్యుల గదిలో  పుస్తకాల మధ్య ఈ చీటీ పుస్తకం కనిపించింది. అమృత పిల్లల ఆస్పత్రి చిరునామా, డాక్టర్ వివరాలు అందులో ఉన్నాయి.

ఇక్కడి వైద్యులు రోగులను ప్రైవేటు ఆస్పత్రికి పంపించి వ్యాపారంలో భాగస్వాములవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఈ విషయమై ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన  ఆస్పత్రి సూపరిండెంట్ శివరాంను ప్రశ్నించారు. ఆయన సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు.  ఇలాంటి దందాను సహించేదిలేదన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కారాదన్నారు.

మరిన్ని వార్తలు